లోక్‌సభలో జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై భౌతిక దాడికి ప్లాన్ కాంగ్రెస్ ఎంపీలు చేశారని వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఎంపీలు ‘ఊహించనిది’ ఏదో చేస్తారని సమాచారం ఉందని, ప్రజాస్వామ్య దేవాలయంలో అటువంటి సంఘటలను నివారించడానికి తాను సభను వాయిదా వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ కారణంగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ఇచ్చే సమాధానం రద్దు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా.. ‘పచ్చి అబద్ధాలు’ అంటూ మండిపడ్డారు.
‘లోక్‌సభలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆత్మకథలో అంశాలను ప్రస్తావించడానికి నా సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పట్టింది... 2020 చైనా సరిహద్దు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ నాయకత్వం సైన్యాన్ని ఎలా విస్మరించిందో ఈ పుస్తకం వెల్లడిస్తుంది’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
బుధవారం పలుసార్లు వాయిదాల అనంతరం సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ ప్రారంభమైంది. ఈ సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ వచ్చి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై సమాధానం ఇస్తారని చాలా మంది ఎంపీలు వేచిచూశారు. ఇదే సమయంలో విపక్ష ఎంపీల నిరసనలు కొనసాగుతుండగా.. 8 నుంచి 9 మంది మహిళా ఎంపీలు ప్రధాని మోదీ సీటును చుట్టిముట్టారు. ‘డూ వాట్ ఈజ్ రైట్’ అనే బ్యానర్‌ను ప్రదర్శించగా.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని కొందరు మంత్రులు కోరడంతో వెనక్కి వచ్చారు.
గురువారం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీల తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. ‘పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్దం’ అని వ్యాఖ్యానించారు. ‘‘సభానాయకుడు (మోదీ) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యులు పలువురు ప్రధాని సీటు వద్దకు చేరుకుని ఏదైనా ఊహించని చర్యకు పాల్పడవచ్చని నాకు పక్కా సమాచారం అందింది. నేను ఆ దృశ్యాన్ని సభలో స్వయంగా చూశాను’ అని నిన్న సాయంత్రం జరిగిన గందరగోళాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన అన్నారు.
ఈ గందరగోళం అవాంఛనీయ ఘటనకు దారితీయవచ్చని భయపడి, తక్షణమే ప్రధానిని లోక్‌సభకు రావద్దని కోరినట్టు తెలిపారు. ‘ఒకవేళ ఆ సంఘటన జరిగి ఉంటే, అది దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఛిన్నాభిన్నం చేసే అత్యంత అసహ్యకరమైన దృశ్యంగా ఉండేది.. దీనిని నివారించడానికి, నేను ప్రధానమంత్రిని సభకు రావద్దని కోరాను’ అని ఆయన అన్నారు. ప్రధాని భద్రత దృష్ట్యా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్లాన్‌లో భాగంగానే మహిళా ఎంపీలను ముందుగా అక్కడకు పంపారని ఆరోపించాయి. కాగా, లోక్‌సభలో ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపక్షాల నిరసనల నడుమే గురువారం ఆమోదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa