తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశం మీద ఏపీలోని అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అధికార కూటమి.. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజున సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్లలో జరిగిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ విషయాన్ని మరోసారి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ఈ క్రమంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారన్న చంద్రబాబు.. సీబీఐ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సెట్) ఏమీ లేదని చెప్పారంటూ బుకాయిస్తున్నారని అన్నారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు ప్రస్తావించారు. బాత్‌రూములు శుభ్రం చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి చేశారంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రసాదంపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీశైలం ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటూ ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించామని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను మార్చామని చంద్రబాబు వెల్లడించారు. తిరుమల లడ్డూకు సంబంధించి గతానికి, ఇప్పటికీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు వివరించారు.
మరోవైపు తిరుమల లడ్డూ విషయంపై ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న పరిస్థితులలో.. శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ నెయ్యితో తయారు చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa