ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం.. ట్రెండింగ్‌లో '4018'.. అసలేంటీ నంబర్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 08:27 PM

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ వీధుల్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఒక ఘోర ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతివేగంతో దూసుకొచ్చిన ఒక లంబోర్గిని రెవుల్టో.. అదుపుతప్పి బీభత్సం సృష్టించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పోలీసుల విచారణతో పాటు ఒక నాలుగు అంకెల నంబర్ 4018 సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మరి ఆ నంబర్ దేనికి సంబంధించి, దాని కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ప్రమాదానికి గురైన రూ. 10 కోట్ల విలువైన లంబోర్గిని కారు నంబర్ ప్లేట్‌పై '4018' అని ఉంది. దీన్ని బట్టే ఈ కారు పొగాకు వ్యాపార దిగ్గజం కేకే మిశ్రాకు చెందినదని చెబుతోంది. అయితే ప్రమాద సమయంలో కారు నడపింది ఆయన కుమారుడు శివం మిశ్రా అని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆయన కారు నెంబర్ 4018 మరింత హైలెట్ అయింది. ఈ ఒక్క కారుకే కాకుండా మిశ్రా గ్యారేజీలోని రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి అత్యంత ఖరీదైన కార్లు అన్నింటికీ ఇదే '4018' నంబర్ ఉండటం గమనార్హం. పుట్టిన రోజా, మరేదైనా సెంటిమెంటా అన్నది అధికారికంగా తెలియకపోయినా.. ఈ నంబర్ వెనుక ఉన్న రహస్యంపై నెట్టింట రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.


అసలేమిటీ 'ఏంజెల్ నంబర్' 4018?


న్యూమరాలజీ ప్రకారం 4018ని కొందరు 'ఏంజెల్ నంబర్'గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా నంబర్ 4.. స్థిరత్వం, బలమైన పునాదికి చిహ్నం అని చెబుతున్నారు. అలాగే నెంబర్ 0.. అనంతమైన శక్తి, సంపూర్ణత్వానికి గుర్తు అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా నెంబర్ 1.. కొత్త ప్రారంభాలకు నిదర్శనం అని వివరిస్తున్నారు. ఇక చవరి నెంబర్ 8.. అధికారం, అపారమైన సంపదకు సంకేతం అని తెలుపుతున్నారు. ఈ అంకెల కలయిక భారీ ఆర్థిక విజయాన్ని అందిస్తుందని చెప్పుకొస్తున్నారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం వ్యక్తిగత నమ్మకాల ఆధారంగానే మిశ్రా కుటుంబం దీనిని వాడుతున్నట్లు తెలుస్తోంది.


ప్రమాదం జరిగిందిలా..


ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శివం మిశ్రా మద్యం మత్తులో కారు నడిపినట్లు తెలుస్తోంది. అతివేగంతో వచ్చిన లంబోర్గిని మొదట ఒక ఆటో రిక్షాను ఢీకొట్టి, ఆపై పార్క్ చేసి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి బైక్ నడుపుతున్న వ్యక్తి గాలిలోకి 10 అడుగుల ఎత్తుకి ఎగిరి కిందపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడి బౌన్సర్లు వేరే కారులో వచ్చి, కారు అద్దాలు పగులగొట్టి శివం మిశ్రాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు కారును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌లో విలాసాలకు చిహ్నంగా కనిపించిన ఆ '4018' నంబర్, ఇప్పుడు పోలీసు ఫైళ్లలో నేరానికి సాక్ష్యంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa