విద్యా, వైద్యం.. మనిషి కనీస అవసరాలు.. కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు విద్యా, వైద్యాన్ని వ్యాపారంగా మార్చివేశాయి. ఇలాంటి పరిస్థితులలో తమ బిడ్డలకు నాణ్యమైన చదువు చెప్పించాలన్న మహిళల తపనే ఆ బడికి పునాదిగా మారింది. తమ చిన్నారుల బంగరు భవిష్యత్తును ఊహించుకుంటూ ఆ తల్లులు పడిన కష్టం.. ఆ పాఠశాలకు రూపు తెచ్చింది. రూపాయి, రూపాయి పోగు చేసుకుంటూ ఆ మహిళా సంఘం చేసిన పొదుపు.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ఓ అధునాతన పాఠశాల నిర్మాణానికి కారణమైంది. బిడ్డల బంగారు భవిత కోసం తల్లులు పడిన వ్యథ.. కలిసికట్టుగా పొదుపు చేసుకుని కలను సాకారం చేసుకున్న డ్వాక్రా మహిళల విజయగాథ.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బాలభారతి స్కూలు కథ..
1995లో ఓర్వకల్లు మండలంలోని హుశేనాపురం గ్రామంలో రెండు డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో సంఘంలో పదిమంది సభ్యులు. ఈ సంఘాలు రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగటం ప్రారంభించాయి. ఇదే స్ఫూర్తి మండలమంతా వ్యాపించింది. మండలవ్యాప్తంగా వేయి సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం పదివేల మంది మహిళలు ఇందులో సభ్యులుగా చేరారు. ఈ పొదుపు సంఘాల మహిళలు రోజుకో రూపాయి చొప్పున పొదుపు చేస్తూ.. రూ.8 కోట్లు పోగుచేశారు. ఈ ఎనిమిది కోట్ల రూపాయలను బ్యాంకులో వేయకుండా.. సంఘం సభ్యులకే వడ్డీకి ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కొంతకాలం గడిచేసరికి వడ్డీ రూపంలో మరో ఐదున్నర కోట్లు చేరింది. వీరికి బ్యాంకుల నుంచి కూడా సహకారం లభించడంతో ఓర్వకల్లు మండల సమాఖ్య కొంతకాలంలోనే గణనీయమైన పురోగతి సాధించింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ పొదుపు సంఘాలలోని మహిళలు అందరూ కలిసి ఓ స్కూలును తమ పిల్లల కోసం నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2008లో ఓర్వకల్లు పొదుపు గ్రామైక్య సంఘం కార్యాలయం సమీపంలో..బాలభారతి అనే పేరుతో చిన్న పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడితో వారు ఆగిపోలేదు. తమ పిల్లలకు కార్పొరేట్ తరహాలో స్కూలు ఉండాలని భావించి.. సొంతంగా పాఠశాల భవనం నిర్మాణానికి ఈ పొదుపు సంఘాలు నడుం బిగించాయి.
ఓర్వకల్లు సమీపంలో ఏడెకరాల స్థలం కొనుగోలు చేశారు. అనంతరం స్కూలు నిర్మాణం ప్రారంభించారు. స్కూలు భవనం నిర్మాణానికి వాళ్ళే కూలీలుగా మారి కుటుంబాలతో కలిసి ఎనిమిదేళ్లుగా శ్రమించారు. దీంతో పాఠశాల భవనం నిర్మాణం ఓ రూపు సంతరించుకుంది. 60 తరగతి గదులు నిర్మించాలని ప్రణాళికలు రచించగా.. ఇప్పటి వరకూ 40 క్లాస్‌రూమ్‌ల నిర్మాణం పూర్తైంది. మిగతా నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. తరగతి గదులతో పాటుగా మైదానాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ పిల్లలు తమలా కష్టపడకూడదని.. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాల మహిళ ఎనిమిదేళ్ల నిరంతరే కృషే.. ఈ బాలభారతి పాఠశాల ..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa