ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 11:50 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. శ్రీ‌శైలంలో నిన్న శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. భక్తి, విశ్వాసంతో ఆలయాలకు వచ్చే భక్తులు భయాందోళనల మధ్య దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ...... ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో,  శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వ‌స్తున్నారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబుగారి పాలనలో  చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం,  బాధ్యత అన్నవి ఈ  ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు.శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa