గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, పాలకులు అసెంబ్లీలో తనను అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే 2019-24 మధ్య ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారని, ప్రజలు అన్నింటినీ గమనించి సరైన సమయంలో తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి రాగానే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు.మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు అందిన ఫిర్యాదుల్లో అత్యధికం భూ వివాదాలకు సంబంధించినవే. గత పాలకులు అడిగిన భూములు ఎవరైనా ఇవ్వకపోతే, వాటిని వెంటనే 22ఏ జాబితాలో పెట్టేసి వేధించారు. స్వయంగా చట్టాలు చేసిన ముఖ్యమంత్రే ఇలా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాడేపల్లి ప్యాలస్ సమీపంలో హెలిప్యాడ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ఓ భూమి అడిగారు. అది ఇవ్వలేదని బలవంతంగా 22ఏలో చేర్చేశారు. రూ.33 లక్షలతో నిర్మాణం కోసం జీవో కూడా ఇచ్చేశారు.గత పాలకులు చేసిన పాపాలు కడగడానికే మాకు ఏడాది సమయం పట్టింది. మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను తగులబెట్టడం వాళ్ల అరాచకాలకు నిదర్శనం. అందుకే, 2026 నాటికి ఈ రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేసి, ప్రతి ఒక్కరి భూమికి భద్రత కల్పించేలా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించాం. భూములే కాదు, ఇసుకను కూడా వదలకుండా దోపిడీ చేశారు.తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలోనూ వాళ్లు రాజకీయాలు చేశారు. దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. జరిగిన తప్పులను మేం చెప్పకుండా ఉంటే, ఆ అపవిత్రతను కొనసాగించడానికి వాళ్లు వెనుకాడరు. అందుకే, టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడే బాధ్యతను మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.వివేకా హత్య కేసులో వాళ్లు ఎన్ని నాటకాలు ఆడారో అందరూ చూశారు. నారాసుర రక్త చరిత్ర' అంటూ సాక్షి పత్రికలో రాసి, ఆ నేరాన్ని మాపై నెట్టాలని చూశారు. ఇప్పుడు అదే తరహాలో కల్తీ నెయ్యి వివాదాన్ని మా కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు అంటగట్టి, బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడానికి చీనీ చెట్లను నరికివేసేవారు. ఇప్పుడు అదే ఫ్యాక్షన్ బుద్ధితో మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో మేం కఠినంగా వ్యవహరిస్తాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa