ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో సహా ఇతర మంత్రులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో స్నేహపూర్వక భేటీ జరిగింది.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ పరిపాలనలో సాంకేతికత వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక విధానాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సేవలు, డిజిటల్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. బిల్ గేట్స్ ఈ చర్యలపై ప్రశంసలు కురిపించారు.
అనంతరం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత రంగాల్లో గేట్స్ ఫౌండేషన్‌తో సహకారం, 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌పై చర్చలు జరిగాయి. రాష్ట్రంలో జరుగుతున్న సంజీవని ప్రాజెక్టు వంటి కార్యక్రమాలపై కూడా దృష్టి సారించారు.
ఈ సందర్శన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య బలమైన భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తుందని అంచనా. బిల్ గేట్స్ రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలన, ప్రజా సేవల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa