తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మే నెల దర్శనం, గదుల కోటా విడుదల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఫిబ్రవరి 18వ తేదీన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం పదింటికి ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేయనుంది. ఇక మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన టికెట్ల కోటాను ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.మరోవైపు శ్రీవారి భక్తుల కోసం తిరుమల, తిరుపతిలలో టీటీడీ గదులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలకు సంబంధించిన గదుల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
మరోవైపు ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది. మరోవైపు భక్తులు దళారులను ఆశ్రయించకుండా.. తమ అధికారిక వెబ్ సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa