ఇటీవల ప్రారంభమైన వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటు, ఎగ్జిక్యూటివ్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. అత్యవసర ప్రయాణాలకు అనుగుణంగా ఈ కోటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని జోనల్ కార్యాలయాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. అలాగే, వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయానికి వస్తే.. ఫస్ట్ క్లాస్ ఏసీలో సాధారణ రోజుల్లో నాలుగు, వారాంతాల్లో ఆరు ఎమర్జెన్సీ బెర్తులు, టూటైర్ ఏసీలో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 30 బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 42 బెర్తులు అత్యవసర బెర్తులు అందుబాటులో ఉంచాలి.
నిబంధనలను అనుసరించి అత్యవసర సందర్భాల్లో ప్రయాణాలకు వీలుగా ఎమర్జెన్సీ కోటాను రైల్వే అందుబాటులోకి తెచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ, అధికారిక విధుల్లో భాగంగా ప్రయాణాలు, కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చు. ఈ కోటాలో బెర్తులను సాధారణంగా ఉన్నతాధికారులు ఎక్కువగా వాడుకుంటారు. కానీ, సాధారణ ప్రజలు కూడా కూడా అవసరమైన పత్రాలతో ఈ కోటాలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు. ప్రయాణానికి కనీసం ఒక రోజు ముందు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే.. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. కాగా, తొలి వందేభారత్ స్లీపర్ రైలు.. కోల్‌కతా- గౌవహటి మధ్య జనవరి 17 ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిని దశలవారీగా దేశంలోని సూదూర ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పగటి పూట ప్రయాణించే వందేభారత్ ఛైర్‌కార్ రైళ్లకు విశేష ఆధరణ లభిస్తుంది.
అమృత్ భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉంది. దీంతో మరిన్ని అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అమృత్ భారత్ రైళ్లతోపాటు వందే భారత్ స్లీపర్ రైళ్ల శరవేగంగా తయారవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa