రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో మరో 10 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాల కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
నిమిషాల్లోనే విస్తరించిన మంటలు..
సోమవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పని జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో యూనిట్లో సుమారు 20 నుంచి 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని రసాయన నిల్వలకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన కొందరు కార్మికులు ప్రాణాలకు తెగించి బయటకు పరుగులు తీయగా.. మిగిలిన వారు లోపలే ఉండిపోయారు.
రంగంలోకి యంత్రాంగం.. సహాయక చర్యలు ముమ్మరం
పోలీసులు సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఫ్యాక్టరీ నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుమితా మిశ్రా నేతృత్వంలో పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య బృందాలు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి, భద్రతా నిబంధనల్లో లోపాలను గుర్తించడానికి జిల్లా యంత్రాంగం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ నేతృత్వంలో పోలీసులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
ప్రస్తుతానికి ఏడుగురు మృతి చెందినట్లు నిర్ధారించినప్పటికీ.. గల్లంతైన మరో 10 మంది కోసం లోపల అన్వేషణ కొనసాగుతోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ విషాద ఘటనతో భివాడి పారిశ్రామిక ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa