ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 నెలల పసిపాపకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:30 PM

మరణం ఆ పసిగుండెను ఆపేసినా.. ఆమెలోని ప్రాణం ఇప్పుడు మరో ఐదుగురిలో చిగురించింది. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌గా మారిన పది నెలల చిన్నారి అలిన్‌ షెరిన్‌ అబ్రహం కథ యావత్ దేశాన్ని కదిలించింది. తన అవయవాల దానంతో అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచిన అలిన్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పథనంథిట్ట జిల్లాలోని మల్లప్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.


పది నెలల ప్రాయంలోనే అనంత లోకాలకు..


ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిన్‌ తీవ్రంగా గాయపడింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. చిన్నారి కోలుకోలేక బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకుంది. తమ బిడ్డ తిరిగి రాదని తెలిసినా.. ఆ తల్లిదండ్రులు గుండెలు పిండేసే విషాదాన్ని దిగమింగుకుని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ గారాల పట్టి అవయవాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలిన్ అందించిన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు ఇప్పుడు ఇతరుల రూపంలో ఈ భూమిపై సజీవంగానే ఉన్నాయి.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి స్వయంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. దేశం తరఫున చిన్నారి అలిన్‌కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మనం ఈ చిన్నారి భౌతికకాయాన్ని ఖననం చేస్తున్నా.. అవయవ దానమనే మహోన్నతమైన చర్యతో ఆమె ఇతరుల రూపంలో చిరంజీవిగానే ఉంటుంది. మరణంలోనూ స్ఫూర్తిని నింపిన ఈ కుటుంబానికి దేశం రుణపడి ఉంటుంది" అని భావోద్వేగానికి లోనయ్యారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వేలాది మంది ప్రజలు పాల్గొని బరువెక్కిన హృదయాలతో చిన్నారికి కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళ ప్రభుత్వం అలిన్ త్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర గౌరవ మర్యాదలను ప్రకటించింది. ఆ చిన్నారి అందించిన అవయవాలు సకాలంలో అవసరమైన వారికి చేరేలా కేరళ ఆరోగ్య శాఖ ప్రత్యేక గ్రీన్ కారిడార్‌లను ఏర్పాటు చేసి ఆపరేషన్లను విజయవంతం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa