పాము విషం కేసులో చిక్కుకున్న వివాదాస్పద యూట్యూబర్, బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జంతువులను, ముఖ్యంగా నోరులేని మూగజీవాలైన పాములను వినోదం కోసం వాడుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాములతో ఆటలాడటం నేరం కాదా? అని ప్రశ్నిస్తూనే.. సెలబ్రిటీలు ఇలాంటి పనులకు పాల్పడితే సమాజానికి అత్యంత ప్రమాదకరమైన సందేశం వెళ్తుందని ధర్మాసనం హెచ్చరించింది.
సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి?
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. తనపై నమోదైన ఛార్జిషీటును, క్రిమినల్ చర్యలను సవాలు చేస్తూ ఎల్విష్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మీరు జూకు వెళ్లి అక్కడ జంతువులతో ఆటలాడగలరా? అది నేరం కాదా? మీకు నచ్చినట్లు చేస్తానంటే కుదరదు. పాములను వినోదం కోసం వాడటం వన్యప్రాణి సంరక్షణ చట్టం కిందకు వస్తుంది" అని ఎల్విష్ తరపు న్యాయవాదిని ధర్మాసనం నిలదీసింది.
ఎల్విష్ తరపున సీనియర్ అడ్వకేట్ ముక్తా గుప్తా వాదిస్తూ.. ఎల్విష్ కేవలం సింగర్ ఫాజిల్ పురియా వీడియోలో అతిథిగా కనిపించడానికి మాత్రమే వెళ్లాడని, అక్కడ ఎటువంటి రేవ్ పార్టీ జరగలేదని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న తొమ్మిది పాములు విషపూరితమైనవి కావని మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని వాదించారు. అయితే పోలీసులు ఐదు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను రక్షించారని.. అక్కడ పాము విషాన్ని మాదకద్రవ్యంగా వాడినట్లు అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మార్చి 19కి వాయిదా..
అసలు పాము విషాన్ని ఎలా సేకరిస్తారు? రేవ్ పార్టీల్లో దానిని వినోదం కోసం ఎలా ఉపయోగిస్తారు? అసలు భయం లేకుండా వాటిని ఎలా పట్టుకుంటారు? అనే విషయాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. గతంలో ట్రయల్ కోర్టులో ఎల్విష్పై జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.
అసలీ కేసు ఏమిటి?
2023 నవంబర్లో నోయిడాలో జరిగిన ఒక రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారనే ఆరోపణలపై ఎల్విష్ యాదవ్పై కేసు నమోదు అయింది. ఈ కేసులో 2024 మార్చి 17న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛార్జిషీటులో విదేశీయులు కూడా ఈ పార్టీల్లో పాల్గొని పాము విషాన్ని మత్తు కోసం వాడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa