దేశవ్యాప్తంగా రాజ్యసభ రాజకీయం మళ్లీ వేడెక్కింది. 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఎన్నికల ద్వారా పార్లమెంటు ఎగువ సభలో పార్టీల బలాబలాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలక పక్షమైన బీజేపీ తన సభ్యుల సంఖ్యను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 26న ఎన్నికల అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల గడువు మార్చి 5వ తేదీ వరకు ఉంది. ఇక నామినేషన్ల పరిశీలన మార్చి 6వ తేదీ ఉండగా.. ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. మార్చి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు?
వచ్చే ఏప్రిల్ 2, 9 తేదీల్లో 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అలాగే తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, ఛత్తీస్గఢ్లో 2, హర్యానాలో 2, తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానం ఖాళీగా మారబోతున్నాయి. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డిల పదవీకాలం కూడా ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. దీంతో ఇక్కడి రెండు స్థానాలకు కూడా మార్చి 16నే పోలింగ్ జరగనుంది.
బీజేపీకి కలిసొచ్చే అంశం..
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 99 మంది సభ్యులు ఉండగా.. ఎన్డీఏ కూటమి బలం 120 దాటింది. ఏప్రిల్లో రిటైర్ అవుతున్న 37 మందిలో బీజేపీ సభ్యులు కేవలం 9 మందే ఉన్నారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, హర్యానా వంటి రాష్ట్రాల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలు అధికారంలో ఉండటంతో.. ఈ 37 సీట్లలో బీజేపీ సుమారు 15 నుండి 18 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎగువ సభలో ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇవ్వనుంది. మరోవైపు ఎన్సీపీ-ఎస్పీ పార్టీకి చెందిన శరద్ పవార్, ఆర్పీఐ-ఏకు చెందిన రాందాస్ అఠవాలే, డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, జేడీయూ నుంచి హరివంశ్ వంటి ప్రముఖుల పదవీకాలం ముగియనుండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa