ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలనెలా మీ జీతం నుంచే కట్ ,,,,మీకు ప్రొఫెషనల్ టాక్స్ గురించి తెలుసా

business |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 11:26 PM

భారతదేశంలో ప్రజలు వివిధ రూపాల్లో టాక్స్‌లు చెల్లిస్తుంటారు. వీటిల్లో ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తే ఇన్‌కంటాక్స్ (ఆదాయపు పన్ను), కార్పొరేట్ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (మూలధన లాభాల పన్ను) వంటివి ఉంటాయి. పరోక్ష పన్నుల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ వంటివి ఉంటాయి. ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రాజెక్టులు నిర్మించాలి. రోడ్లు వేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇలా వీటన్నింటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. వీటి కోసమే ప్రజల నుంచి పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తుంటాయి. ఇందులోనే చాలా మందికి తెలియని మరొక పన్ను ఉంది. అదే ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తిపరమైన పన్ను).


>> ఇది ప్రత్యక్ష పన్నుల కిందికే వస్తుంది. ప్రొఫెషనల్ టాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తుంటాయి. ఇక్కడ నిర్దిష్ట పరిమితి దాటిన ఆదాయం ఉన్న వేతన జీవులకు ఇంకా స్వయం ఉపాధి పొందే వారి ఈ టాక్స్ పడుతుంది. ఇక్కడ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, కన్సల్టెంట్స్ ఇలా అంతా తమ వృత్తితో సంపాదించే ఆదాయంపై ప్రొఫెషనల్ టాక్స్‌ను.. ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రొఫెషనల్ టాక్స్ చెల్లిస్తున్న సంగతి కూడా మీకు తెలియక పోవచ్చు.


ఈ ప్రొఫెషనల్ టాక్స్ అనేది మీ పే స్లిప్‌లో కూడా ఉంటుంది. ఇది మీ సీటీసీలో మాత్రం భాగంగా ఉండదు. మీ గ్రాస్ శాలరీ నుంచి కట్ చేసి.. మీ యజమాని ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. దీంతో మీకు చేతికి అందే వేతనం కాస్త తగ్గుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 276 ను బట్టి.. ప్రొఫెషనల్ టాక్స్‌ను ఏడాదిలో రూ. 2500 కు మించి వసూలు చేయొద్దు. ఇంకా మీరు చెల్లించే ప్రొఫెషనల్ టాక్స్‌పై.. ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు.


ఈ టాక్స్ అనేది రాష్ట్రాల్ని.. అక్కడి ఆదాయ పరిమితులు, ఉపాధి అవకాశాల్ని బట్టి మారుతుంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ఆదాయంపై ఒక్కో రకంగా విధిస్తుంటారు. ఇంకా అన్ని రాష్ట్రాల్లో ఇది అమల్లో లేదు.


ప్రొఫెషనల్ టాక్స్ విధించే రాష్ట్రాలు..


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్.


వృత్తి పన్ను విధించని రాష్ట్రాలు..


అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దమన్ దీవ్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఈ టాక్స్ లేదు.


తెలంగాణ, ఏపీలో ప్రొఫెషనల్ టాక్స్ ఎంత?


తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15 వేల లోపు నెల జీతం ఉన్న వారికి ప్రొఫెషనల్ టాక్స్ లేదు. రూ. 15 వేల నుంచి 20 వేల వరకు సంపాదిస్తుంటే నెలకు రూ. 150, రూ. 20 వేలపైన జీతం ఉన్న వారికి రూ. 200 చొప్పున ప్రొఫెషనల్ టాక్స్ కట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకలో రూ. 25 వేల పైన జీతం ఉంటే రూ. 300, మహారాష్ట్రలో రూ. 10 వేలపైన ఉన్నా పురుషులకు రూ. 300 చొప్పున ప్రొఫెషనల్ టాక్స్ విధిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో 6 నెలలకు కలిపి రూ. 75 వేలపైన జీతం ఉన్న వారికి 6 నెలలకు ఓసారి రూ. 1250 చొప్పున టాక్స్ కట్ చేస్తుంది.


సీనియర్ సిటిజెన్లకు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి.. సైన్యంలో పని చేసే వారికి.. ఈ ప్రొఫెషనల్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంది. వీరు చెల్లించాల్సిన అవసరం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa