ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 09:15 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహా పాపానికి పాల్పడిన నిందితులను నడిరోడ్డుపై నిలబెట్టి శిక్షిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. వారి కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు హెరిటేజ్ సంస్థపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2024కు ముందు తిరుమల దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోయిన విషయం అనుభవంలోకి వచ్చిందన్నారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదని, కానీ గత పాలకులు దాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు కొనుగోలు చేసిన నెయ్యి నమూనాలను గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డుకు  పరీక్షల నిమిత్తం పంపిస్తే, అది అసలు నెయ్యే కాదని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదిక ఇచ్చింది. దీనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  సైతం తన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. సరఫరా చేసింది నెయ్యి కాదని, కేవలం రసాయనాలతో తయారు చేసినట్లు తేల్చింది అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ తప్పును తాము బయటపెడుతుంటే, దొంగే దొంగా అని అరిచినట్లుగా తిరిగి ప్రభుత్వంపైనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.వివేకానంద రెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ ఆ 'నాటకాల రాయుడు' రోజుకో వేషం వేశాడని, చివరకు తన చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేలా నాటకాలు రక్తి కట్టించాడని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. అలాంటి వారే ఇప్పుడు తిరుమల నెయ్యి విషయంలోనూ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మసీదు, చర్చి, దేవాలయం ఏదైనా వాటి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫొటోలను చెప్పులతో పట్టుకుని, సభలో రాజకీయం చేసి, ఆ తర్వాత ఫొటోలను అక్కడే పడేసి వెళ్లారని, వారికెందుకు ఇంత అహంకారమని ప్రశ్నించారు.వైసీపీ నేతల భాషపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో అసెంబ్లీలో నా భార్యపై అత్యంత నీచంగా మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ బూతులు మాట్లాడటం మాత్రం మానలేదు. ఆబోతుల మాదిరిగా తయారై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారితో తిట్టించుకోవడానికే మనం రాజకీయం చేస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు చెత్త రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, పరామర్శల పేరుతో వెళ్లి అమాయకులను తమ కార్ల కింద తొక్కించి చంపుతారని, కానీ వారిని పరామర్శించరని విమర్శించారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారని, పరిశ్రమలను తరిమికొట్టి ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నమ్మకాన్ని పోగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని, తమ ప్రభుత్వంలో మత్తు పదార్థాలు సేవించి ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందనే భయంతోనే మదనపల్లి అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. చెడును నిరాకరించే శక్తి ప్రజల్లో వచ్చినప్పుడే రాజకీయ ప్రక్షాళన సాధ్యమవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకునే ఈ బృహత్కార్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa