Afghan-Pakistan Conflict: ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శుక్రవారం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌తో పాటు కాందహార్, పక్తియా ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసినట్లు సమాచారం.దీనికి ప్రతిస్పందనగా తాలిబాన్లు కూడా పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలు చేపట్టినట్లు ప్రకటించాయి. ఇస్లామాబాద్ సహా నాలుగు ప్రాంతాలపై డ్రోన్ దాడులు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. తమ లక్ష్యాలు పాకిస్తాన్ సైనిక స్థావరాలేనని తాలిబాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై రష్యా, చైనా, టర్కీ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరు పక్షాలు శాంతి మార్గం అనుసరించాలని సూచించాయి. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న “డ్యూరాండ్ లైన్” వివాదమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
-‘డ్యూరాండ్ లైన్’ వివాదం మూలం : ఆఫ్ఘాన్–పాక్ మధ్య సమస్య కొత్తది కాదు; దాదాపు 132 ఏళ్ల చరిత్ర కలిగినది. సుమారు 2,640 కిలోమీటర్ల మేర విస్తరించిన డ్యూరాండ్ లైన్ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో ఏర్పడింది. ఈ రేఖ బ్రిటీష్ ఇండియా–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును నిర్ణయించింది. అయితే ఈ సరిహద్దు పష్టూన్, బలూచ్ తెగలను రెండు వైపులా విడదీసింది.1893 ఒప్పందాన్ని ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా అంగీకరించలేదని చెబుతూ వస్తోంది. ముఖ్యంగా పష్టూన్ జనాభా అధికంగా ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం తమ చారిత్రక భూభాగమని తాలిబాన్లు సహా పూర్వ ఆఫ్ఘాన్ ప్రభుత్వాలు వాదించాయి. పాకిస్తాన్ మాత్రం డ్యూరాండ్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తోంది. ఇదే ప్రాంతంలో ‘పాక్ తాలిబాన్లు’ పాకిస్తాన్ భద్రతా దళాలపై తరచూ దాడులు చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది.
-భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత : డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్‌పై గీత మాత్రమే కాదు; ఇది దక్షిణాసియాలో అత్యంత వివాదాస్పద సరిహద్దులలో ఒకటి. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా తన సార్వభౌమాధికారంలో భాగమని చెబుతుండగా, ఆఫ్ఘనిస్తాన్ దీనిని చారిత్రక అన్యాయంగా అభివర్ణిస్తోంది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యాల మధ్య తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటుంటాయి.అలాగే అరేబియా సముద్రానికి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్ ప్రాంతం కూడా వ్యూహాత్మకంగా కీలకం. 2017లో పాకిస్తాన్ ఈ సరిహద్దు వెంట కంచె నిర్మాణం ప్రారంభించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో డ్యూరాండ్ లైన్ సమస్య పరిష్కారం కాకపోతే ఆఫ్ఘాన్–పాక్ సంబంధాలు స్థిరపడటం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa