ఇజ్రాయెల్-అమెరికా దాడులతో చమురు రవాణకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. దాటేందుకు ప్రయత్నించిన నౌకలను పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో నాలుగు రోజులుగా ఈ మార్గంలో చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( IRGC ) గురువారం కీలక ప్రకటన చేసింది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా, వారి మిత్రదేశాలకు చెందిన నౌకలకు మాత్రమే మూసివేసినట్టు తెలిపింది. ఇరాన్ అధికారిక మీడియా IRIB ఈ మేరకు ప్రకటించింది. గల్ఫ్‌లో ఉద్రిక్తతలతో దాదాపు అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాలలో ఒకటైన హర్మూజ్ జలసంధి మూసివేతతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ నిర్ణయం భారత్‌కు కొంత మేర ఊరట కలిగించేదే. కేవలం అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని ప్రకటించింది. దేశీయ అవసరాలకు చమురు, సహజ వాయువు, ఎరువులు వంటివి దాదాపు 40 శాతం ఈ మార్గం గుండానే భారత్‌కు చేరుకుంటాయి.
అంతర్జాతీయ చట్టం, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగా యుద్ధ సమయంలో హార్ముజ్ జలసంధిని నియంత్రించే హక్కు ఇరాన్‌కు ఉందని ఇప్పటికే స్పష్టం చేసినట్లు రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా, వారి మద్దతుదారులకు చెందిన ఏవైనా నౌకలు జలమార్గంలో కనిపిస్తే ఖచ్చితంగా దాడి తప్పదని హెచ్చరించింది. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకెళ్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఐఆర్‌సీజీ తేల్చిచెప్పింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికాల సంయుక్త ఆపరేషన్ తర్వాత జల సంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతుందనే భయాలు వెంటాడుతున్నాయి.
ఇదిలా ఉండగా, చైనా నౌకలకు మంగళవారం రాత్రి నుంచి అనుమతించింది. పశ్చిమాసియాలో ఘర్షణ మొదలైనప్పటి నుంచి తమకు చైనా మద్దతుగా నిలవడంతోనే కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. గల్ఫ్‌లో పోర్టులకు సముద్ర మార్గంగా బయటకు వెళ్లేందుకు ఏకైక దారి హర్మూజ్ జల సంధి మాత్రమే. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో సరఫరా గొలుసుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మార్గంలో ప్రయాణించి ప్రమాదంలో చిక్కుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ప్రపంచ ఇంధన సరఫరాలో హర్మూజ్ ఇది ఓ మూలస్తంభం. ప్రపంచంలో పదో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్, డజనుకు పైగా దేశాలకు వస్తువులను ఎగుమతిచేసే ప్రధాన కేంద్రమైన దుబాయ్‌లోని జెబెల్ అలీ ఓడరేవుకు ఇది ఏకైక మార్గం. ఈ జల సంధిని ఇప్పటి వరకూ ఎప్పుడూ వాణిజ్య నౌకలకు మూసివేయలేదు. ఇరాన్-ఇరాక్ మధ్య 1980 నుంచి 1988 వరకు జరిగిన యుద్ద సమయంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగినా రవాణా మాత్రం నిలిచిపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa