ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం 2 వారాలు కొనసాగితే బ్యారెల్ చమురు 150 డాలర్లకు.. ఖతార్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:38 PM

పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికాల మధ్య యుద్దం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. అలాగే, గల్ఫ్ దేశాలపై దాడులతో ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది. ఈ పరిణామాలు అందర్నీ కలవరానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఖతార్ చేసిన ప్రకటన.. మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్‌ 150 డాలర్ల వరకు చేరుతుందని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు. అలాంటి పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.


దీర్ఘకాలిక యుద్ధం కారణంగా గల్ఫ్ ఇంధన ఎగుమతిదారులు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తుందని అల్-కాబీ అన్నారు. ప్రపంచానికి పెను సంక్షోభం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. ఘర్షణ తక్షణమే ఆగిపోయినప్పటికీ, తమ దేశంలోని అతిపెద్ద చమురు రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత సాధారణ పరిస్థితికి చేరుకోడానికి ఖతార్‌కు వారాల నుంచి నెలల వరకు పట్టొచ్చని ఆయన అన్నారు. లిక్విడ్ నేచురల్ గ్యాస్‌ (ఎల్ఎన్జీ)ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఖతార్. ప్రపంచ సరఫరాలో 20 శాతం వాటా కలిగిన ఖతార్... ఆసియా, ఐరోపా మార్కెట్లలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే వారం రోజుల్లోనే చమురు ధరలు 15 శాతం మేర పెరిగి.. బ్యారెల్ 87 డాలర్లకు చేరుకుంది.


ఇక, హర్మూజ్ జలసంధి నుంచి ఇజ్రాయెల్, అమెరికా, ఐరోపా, దాని మద్దతుదారుల నౌకలను అనుమతించేది లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత వంటి తటస్థ దేశాలకు కొంత ఊరట నిచ్చింది. చైనా జెండా ఉన్న నౌకలను మంగళవారం రాత్రి నుంచి ఇరాన్ అనుమతిస్తుంది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్‌కు మద్దతుగా యూకే నాలుగు యుద్ధ విమానాలను పంపుతున్నట్టు ఆ దేశ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఆ దేశ రాజుకు హామీ ఇచ్చారు.


ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకూ తమ సైనికులు 67 మంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడినట్టు ప్రకటించిన తొలి గల్ఫ్ దేశ ఇదే. కువైట్‌లో అమెరికా సైనిక స్థావరాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఆ దేశాన్ని ఇరాన్ టార్గెట్ చేసింది. గత కొద్ది గంటలుగా తమ సైన్యానికి చెందిన డ్రోన్లు.. అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయని, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడి కాసేపటికే కువైట్ గాయపడిన తన సైనికుల సంఖ్యను వెల్లడించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa