పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఖతార్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడి 1,000 మంది భారతీయ పౌరులు మంగళవారం రోజు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఖతార్ ఎయిర్వేస్ ప్రత్యేక విమానాల ద్వారా వీరు ఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు చేరుకున్నట్లు ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
యుద్ధం కారణంగా విమాన సర్వీసులు పరిమితమైన వేళ.. అత్యవసర కేసులు, ప్రాధాన్యత కలిగిన వారికి మానవతా దృక్పథంతో భారత ఎంబసీ ముందస్తు వీసాలు, ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. కేవలం గగనతలం ద్వారానే కాకుండా రోడ్డు మార్గం ద్వారా కూడా భారతీయులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఖతార్‌లోని సాల్వా సరిహద్దు మీదుగా సౌదీ అరేబియాకు వెళ్లేందుకు వీలుగా 96 గంటల కాల పరిమితి కలిగిన తాత్కాలిక ట్రాన్సిట్ వీసాలను జారీ చేసింది. దీనివల్ల వందలాది మంది భారతీయులు సౌదీకి చేరుకుని.. అక్కడి నుంచి భారత్‌కు విమానాల్లో రావడానికి మార్గం సుగమమైంది.
బాస్కెట్‌బాల్ జట్టు సురక్షితం
ఖతార్‌లో చిక్కుకుపోయిన భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు కూడా సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించి సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో సహకరించిన ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలకు భారత రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. మార్చి 11వ తేదీన కూడా ఢిల్లీకి మరిన్ని విమానాలు నడపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖతార్‌లో 24/7 కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని.. హెల్ప్లైన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఎంబసీ పేర్కొంది.
బహ్రెయిన్ ఎంబసీ హెచ్చరిక
మరోవైపు బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక కీలక ప్రకటన జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలోని ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు, గ్రూపులు పొరుగు దేశాలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వాటితో ఎంబసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తుల ప్రయాణ ఏర్పాట్ల విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల ద్వారానే సమాచారం పొందాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa