విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పిందనే చెప్పొచ్చు. నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం సిద్దమైనది. నిధులపై వడ్డీ కోత విధించాలన్న ప్రతిపాదనతో తలెత్తిన వివాదానికి సీఎం చంద్రబాబు జోక్యంతో తెరపడింది. ఎలాంటి కోతలు లేకుండా పూర్తి బకాయిలను విడుదల చేయాలని ఆయన ఆదేశించడంతో నిధుల విడుదల ప్రక్రియ మళ్లీ మొదలైంది.వివరాల్లోకి వెళితే... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు గత నెల 10న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వో) జారీ చేసింది. అయితే, నిధులు విడుదల చేయడంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓ మెలిక పెట్టారు. ప్రభుత్వం రుణం తెచ్చి ఈ బకాయిలు చెల్లిస్తున్నందున, ఆ రుణంపై పడే 7.5శాతం వడ్డీని (సుమారు రూ.90 కోట్లు) కాలేజీ యాజమాన్యాలే భరించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కాలేజీలే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాలని కోరారు.అధికారుల ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలకు తామే వడ్డీ కట్టడమేంటని, రుణం తీసుకున్నట్లు ఎలా సంతకాలు చేస్తామని ప్రశ్నించాయి. ఈ వివాదం కారణంగా నిధుల విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు మెయిల్స్ ద్వారా నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశాయి. తమకు రావాల్సిన బకాయిలపై వడ్డీ విధించడం అన్యాయమని ఆయన దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వడ్డీ ప్రతిపాదనను వెంటనే పక్కనపెట్టి, బకాయిలను యథాతథంగా విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. తొలి విడతగా బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa