ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్కింగ్ ఉమెన్స్‌కు కొత్తగా సఖీ నివాస్..ఏపీ కేబినెట్ నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 04:47 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేసే మహిళల కోసం సఖీ నివాస్ పేరుతో హాస్టళ్లు ఏర్పాటు చేయనుంది. మిషన్ శక్తి కింద క్రెచ్ సౌకర్యాలతో ఈ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. వివిధ రకాల పనుల కోసం2,316 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 119 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్‌ నిర్మించే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.


రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపుల విషయంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక వనరులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థలకు రూ.300 కోట్లు ఆర్థిక వనరులు కల్పించనున్నారు. ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు రాయితీలు, 300 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రిజర్వ్‌ ఎస్ఐ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మిషన్ శక్తి కార్యక్రమం కింద పనిచేసే మహిళల కోసం సఖీ నివాస్ పేరుతో హాస్టళ్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనకు మంత్రిమండలిలో ఆమోదం తెలిపారు.


 మరోవైపు నగరాలకు వచ్చే యువతులు వసతి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సఖీ నివాస్ పేరుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ఏర్పాటు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వీటిలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే ఏపీలోనూ వీటిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులు ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం నగరాలకు వస్తుంటారు.


ఇలాంటివారికి ఆర్థికంగా కాస్త ఉపయోగపడేలా , అలాగే భద్రత కల్పించేలా ఈ సఖీ నివాస్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలకు సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి యువతులు వస్తుంటారు. అలాంటి వారికి ఈ హాస్టళ్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa