ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనం మీది చేప మాయం.. స్నేహితుడే తిన్నాడనుకుని హత్య

national |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 08:06 PM

వారు ముగ్గురూ మంచి స్నేహితులు. అయితే చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే వీరు.. ఇటీవలే చేపలు తెచ్చుకున్నారు. ఎంచక్కా ఫ్రై కూడా చేసుకుని పెనం మీద పెట్టారు. అయితే అవి కాస్త చల్లగా అయ్యాక తినాలి అనే ఉద్దేశంతో వాటిని అక్కడే పెట్టి పడుకుండిపోయారు. కానీ వారు నిద్ర లేచేసరికి తెల్లారిపోయింది. దీంతో వెంటనే ఆకలి వేయగా.. పెనం వద్దకు వెళ్లి చూశారు. కానీ అక్కడ చేప ముక్కలు కనిపించలేదు. దీంతో ఇంకా నిద్రపోతున్న తమ స్నేహితుడే తిని ఉంటాడని భావించిన ఇద్దరు వ్యక్తులు అతడిని కొట్టి చంపేశారు. కానీ ఆ తర్వాతే ఆ చేపలను తిన్నది ఎలుకలు అని తేలింది.


అసలేం జరిగిందంటే..?


ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో 35 ఏళ్ల అఫ్సర్ అనే వ్యక్తి.. తన స్నేహితులు సురేష్, రాజేష్‌లతో కలిసి నివసిస్తున్నాడు. వీరంతా పాత సామాన్లు సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఫిబ్రవరి 24వ తేదీన రాత్రి వీరి ముగ్గురు కలిసి చేపలు తెచ్చుకున్నారు. ఎంచక్కా ఫ్రై కూడా చేసుకున్నారు. కానీ అవి వేడిగా ఉండడంతో.. చల్లారాక తినాలని పడుకున్నారు. అయితే ఆ సమయంలో అఫ్సర్ మద్యం సేవించి ఉన్నాడు. ముగ్గురికీ బాగా నిద్ర పట్టింది. కాసేపయ్యాక లేవాలని అనుకున్నా నిద్ర బాగా పట్టడంతో.. మరుసటి రోజు ఉదయమే సురేష్, రాజేష్‌లు నిద్ర చేశారు. వెంటనే ఆకలి వేయడంతో.. చేపలు తినాలని వెళ్లారు. కానీ పెనం మీద ఒక్క చేప ముక్క కూడా కనిపించలేదు.


దీంతో మద్యం మత్తులో ఉన్న అఫ్సరే రాత్రి తిని ఉంటాడని భావించి.. అతడిని అడిగారు. అతడు తాను తినలేదని చెప్పినా నమ్మలేరు. మత్తులో ఉండడం వల్ల ఎంచక్కా తిని ఆ విషయాన్ని మర్చిపోయాడని భావించారు. దీంతో అతడిపై విపరీతమైన కోపంతో ఊగిపోతూ.. సురేష్, రాజేష్‌లు అఫ్సర్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. కోపం కట్టలు తెంచుకోవడంతో పక్కనే ఉన్న ఒక భారీ బండరాయితో అఫ్సర్ తలపై బాదారు. తీవ్ర రక్తస్రావం అయి అఫ్సర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితులు హర్యానాకు పారిపోయారు.


అయితే స్థానికుల ద్వారా అఫ్సర్ హత్య విషయం తెలుసుకున్న వాన్‌రాయ్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నిందితులకు మొబైల్ ఫోన్లు గానీ, ఎలాంటి గుర్తింపు కార్డులు గానీ లేకపోవడంతో దర్యాప్తు కష్టతరమైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు.. ఆ ప్రాంతంలోని దాదాపు 50 మంది చెత్త సేకరించేవారిని విచారించారు. చివరకు నిందితుల ఆచూకీ కనుగొని.. హర్యానాలో సురేష్‌ను, ఒక రైల్వే స్టేషన్‌లో రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారించగా.. ఈ హత్యోదంతం బయటపడింది. ముఖ్యంగా చేప ముక్కల కోసమే హత్య చేశామని నిందితులు ఒప్పుకోగా.. అవి ఎలుకలు తిన్నాయనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఇల్లంతా చూస్తే ఆ విషయం మీకు అప్పుడే అర్థం అయి ఉండేదని కూడా నిందితులకు వివరించారు.


మరోవైపు రాజేష్ అనే నిందితుడిపై గతంలోనే హత్య, దోపిడీ వంటి అనేక తీవ్రమైన నేరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితులపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కేవలం చేపల కోసం ప్రాణస్నేహితుడిని బలి తీసుకోవడం ముంబైలో కలకలం రేపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa