అమెరికాలో స్థిరపడాలనే ఆశతో 11 మంది భారతీయులు వేసిన ఓ మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. నిబంధనల ప్రకారం వీసా పొందే మార్గం లేక.. అడ్డదారిలో 'యు-వీసా' దక్కించుకోవడం కోసం.. ఏకంగా దొంగతనం డ్రామా ఆడారు. అయితే అమెరికన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ కుట్రను గుర్తించి.. కావాలనే డ్రామా ఆడుతున్నట్లు తెలుసుకుని మొత్తం 11 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశాయి.
అమెరికా చట్టాల ప్రకారం.. ఎవరైనా వ్యక్తి తీవ్రమైన నేరానికి గురై, ఆ నేరానికి సంబంధించిన దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తే.. వారికి ప్రభుత్వం 'యు-వీసా' మంజూరు చేస్తుంది. దీని ద్వారా వారు అమెరికాలో చట్టబద్ధంగా నివసించే హక్కు పొందుతారు. ఈ వీసాతో వలసదారులకు పని అనుమతితో పాటు 5 నుంచి 10 ఏళ్లలోనే గ్రీన్ కార్డు పొందే అవకాశం కూడా ఉంటుంది. సరిగ్గా ఇదే నిబంధనను ఓ భారతీయ ముఠా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది అందుకోసం ఓ అద్భుతమైన ప్లాన్ వేసి మరీ అమలు చేసింది. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది.
బోస్టన్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం.. ఈ ముఠా కన్వీనియన్స్ స్టోర్లు, లిక్కర్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనీసం ఆరు నకిలీ దోపిడీలను సృష్టించింది. ముందుగా అనుకున్న ప్రకారం.. ఒక వ్యక్తి నకిలీ తుపాకీతో షాపులోకి ప్రవేశించాడు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని (వీరు కూడా ముఠా సభ్యులే) భయపెట్టి కౌంటర్లో ఉన్న నగదును తీసుకుని పారిపోయాడు. అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యేలా చూసుకున్నారు. దొంగ పారిపోవడానికి వీలుగా.. దోపిడీ జరిగిన ఐదు నిమిషాల వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేరు. ఆ తర్వాత తాము బాధితులమని, తమను భయపెట్టి దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే కేసు నమోదు చేసుకుని విచారించేటప్పుడు బాధితులు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు బాగోతం బయటపడింది. ముఖ్యంగా బాధితులుగా నటించేందుకు ఈ నిందితులు నిర్వాహకులకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ సొమ్ములో కొంత భాగాన్ని షాపు యజమానులకు ఇచ్చి, వారి షాపుల్లో ఈ నకిలీ దోపిడీలు జరిగేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుసుకుని ముఠాలోని 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జితేంద్రకుమార్ పటేల్, మహేష్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్ సహా మరో 8 మంది ఉన్నారు. వీరిని మసాచుసెట్స్, కెంటుకీ, మిస్సౌరీ, ఒహియో వంటి వివిధ రాష్ట్రాల్లో ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.
ఈ వీసా మోసం కుట్ర రుజువు అయితే.. నిందితులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, దాదాపు 2,50,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 2 కోట్లు) జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై బోస్టన్ ఫెడరల్ కోర్టులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa