వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే విధంగా ఉందని, కార్మికులు, రోజువారీ కూలీలకు ఉపాధి లేకపోవడంతో, కడుపు నింపుకోలేని దుర్భరస్థితికి దిగజారారని, అనారోగ్యసమస్యలతో అల్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా ప్రజలకు ఒరగబెట్టింది ఏదీ లేదన్న ఆయన, ఇసుక విషయంలో కృత్రిమ కొరత సృష్టించిన ప్రభుత్వం, నూతన పాలసీల పేరుతో నిర్మాణరంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ఆయన స్పష్టంచేశారు. ఇసుక విధానంలో కొత్తపాలసీ వచ్చి 23రోజులైనా నిర్మాణరంగం గాడిన పడలేదన్నారు. 20లక్షలకు పైగా కార్మికులు వీధినపడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇసుక సరఫరాకు కొత్తపాలసీ తెచ్చాం, అందరికీ అందుబాటులోకి తెచ్చామంటూ మంత్రులు, ఎమ్యెల్యేలు, అధికారులు చేస్తున్న ప్రకటనలు అద్భుతంగా ఉంటే, కిందిస్థాయిలో ఆచరణమాత్రం అధమంగా ఉందని డొక్కా కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 62వేల మెట్రిక్‌టన్నుల ఇసుక అవసరమైతే, కేవలం 4-5వేలమెట్రిక్‌టన్నులు మాత్రమే అందుబాటులో ఉండటం, నిర్మాణరంగదుస్థితిని తెలియచేస్తోందని మాజీమంత్రి స్పష్టంచేశారు. ఇసుక లభించక నిర్మాణరంగంతో పాటు, అనుబందరంగాల్లోని కార్మికులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతూ, సరైన ఆహారం లభించక, ఆరోగ్యసమస్యలతో ఇబ్బందులు పడుతున్న వైనాన్ని తెలియచేసిన ఒకపత్రిక కథనాన్ని ఈ సందర్భంగా మాణిక్యవరప్రసాద్ ఉటంకించారు. నెలకు రూ.10వేలు సంపాదించే ఒక్కో కుటుంబం ఆ మొత్తాన్ని కోల్పోతే, దాని ప్రభావం రాష్ట్ర ఆర్థికరంగంపై పడుతుందని, దానివల్ల గతంలో డీమానిటైజేషన్ సమయంలో తలెత్తిన దుర్భరపరిస్థతులే రాష్ట్రంలో పునరావృతం కానున్నాయని టీడీపీ సీనియర్‌నేత పేర్కొన్నారు. పెద్దపెద్ద కాంట్రాక్టర్లు, బిల్డర్లకే ఇసుక దొరకడం గగనమైతే, ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా యూనిట్‌ఇసుకధర రూ.1675లు ఉంటే, దానికి రవాణా ఖర్చులు పదికిలోమీటర్లకు రూ.500లు అవుతోందని, మొత్తంకలిపి రూ.2200ల వరకు ఖర్చయ్యేపరిస్థితి ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని, ఇసుకసరఫరాలో ఆ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ అబద్ధపు ప్రచారం చేసిన వైసీపీ, నూతన పాలసీవల్ల ఇసుకధర రెండు, మూడురెట్లు పెరిగిన విషయాన్ని గుర్తించాలని ఎమ్మెల్సీ సూచించారు. మరోవైపు పేదల కడుపునింపే అన్నాక్యాంటీన్లు మూసేయడం ఈ ప్రభుత్వ వికృతచర్యల్లో భాగంకాదా అని మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. రెక్కాడితేగానీ డొక్కాడని అడ్డాకూలీలకు పనుల్లేకుండా చేసిన ప్రభుత్వం, పట్టెడన్నంపెట్టే అన్నాక్యాంటీన్లను కూడా మూసేయడం దుర్మార్గంకాక మరేమవుతుందో ప్రభుత్వపెద్దలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. గోదావరిజిల్లాల్లో అన్నార్తుల ఆకలి తీర్చడానికే తన సర్వస్వాన్ని త్యాగం చేసిన డొక్కాసీతమ్మ గారి స్ఫూర్తితో, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, వాటిని మూసేసి ఈ ప్రభుత్వం ఏంసాధించిందో ప్రజలకు చెప్పాలన్నారు. నిత్యం 2లక్షలమంది కడుపునింపే క్యాంటీన్లకు తాళాలేసి, రంగులుమార్చి, వాటిని వైసీపీ కార్యాలయాలుగా ఉపయోగించాలనుకుంటున్నారా.. ఇదేనా పేదలపై మీ ప్రభుత్వ వైఖరి అని డొక్కా నిలదీశారు. ప్రతిపక్షనేత ఇంటిని ముంచడం, వరదలు, విపత్తులకు గురైన ప్రాంతాలను పట్టించుకోకుండా గాలికొదిలేయడం, తప్పుడుకేసులు పెట్టి తెలుగుదేశం నేతల్ని వేధించడం, టీడీపీ హయాంలో బాగుపడిన శ్మశానాలు, అన్నాక్యాంటీన్లు, పంచాయతీభవనాలకు రంగులు మార్చడం తప్ప నాలుగునెలల్లో ప్రభుత్వం సాధించిందేమీ లేదని డొక్కా తేల్చిచెప్పారు. దసరా నాటికి అన్నాక్యాంటీన్లు తెరవకపోతే, టీడీపీ తరుపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa