ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య 1528 - 2019 : తీర్పులు..ట్విస్టులు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 10:16 AM

అయోధ్య భూ వివాదంలో ఎన్నో మలుపులు. ఊహకందని ట్విస్ట్‌లు. 1528 నుంచి మొదలుకొని .. 2019 వరకు ఊహకందని పరిణమాలు చోటు చేసుకున్నాయి. అసలు అయోధ్య భూ వివాదం ఏంటి? అక్కడ ఉన్నది రామమందిరమా? మసీదా? అయోధ్య వివాదంపై ఏ ఏ కోర్టుల్లో ఎలాంటి వాదనలు జరిగాయి? ఎలాంటి తీర్పులు వెలువడ్డాయి? 


రామాయణం ప్రకారం సరయు నది తీరంలోని అయోధ్యలో.. రాముడు జన్మించాడు. రామజన్మభూమి భావితరాలకు గుర్తుండేందుకు.. ఆలయం ఉండేదని ప్రతీతి. 1528లో ఆ ఆలయాన్ని మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ సైన్యాధిపతుల్లో ఒకరైన మీర్‌ బాకీ  నేలమట్టం చేసి.. బాబ్రీ మసీదు నిర్మించాడంటారు. ఈ మసీదునే.. 1992 డిసెంబర్ 6న కరసేవకులు ధ్వంసం చేశారు. 


బాబ్రీ మసీదు నిర్మించిన తర్వాత.. మసీదు లోపల ముస్లింలు.. బయట హిందువులు ప్రార్థనలు చేసుకునేవారంటూ.. 1813-14లో ఈ ప్రాంతంలో సర్వే చేసిన ఈస్టిండియా కంపెనీ సర్వేయర్‌ ఫ్రాన్సిన్ బుచానన్ తన పుస్తకాల్లో రాశాడు. అయితే.. తొలిసారి 1853లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని చెబుతారు. దీంతో ఈ వివాదంపై దృష్టి పెట్టిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం.. 1859లో ఆ స్థలాన్ని రెండు భాగాలు చేసి, కంచె వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. ఆ తర్వాత 1885లో స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని ఫైజాబాద్ న్యాయస్థానంలో మహంత్ రఘుబీర్ దాస్ కేసు వేశారు. కానీ.. వివాదానికి మాత్రం పరిష్కారం దొరకలేదు. 


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో మసీదులో రాముడు, సీతాదేవిల విగ్రహాలు.. మసీదు మధ్య భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిష్టించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అల్లర్లు చెలరేగాయి. ఇరువర్గాలు సివిల్ సూట్‌ను ఫైల్ చేశాయి. వివాదం ఉండంతో ప్రభుత్వం అక్కడ గేటుకు తాళాలు వేసింది. దానిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. 


ఈ వివాదం జరిగిన దాదాపు 37 ఏళ్ల తరువాత బాబ్రీ మసీదు తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. 1986లో హిందుత్వ వాదులకు అనుకూలంగా ఫైజాబాద్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ అనుమతితో విశ్వహిందూ పరిషత్ రామ మందిరానికి పునాదిరాయి వేసింది.


 


1990 - 91లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టారు. మసీదు ప్రాంతంలోకి దూసుకెళ్లడానికి ఓసారి కరసేవరకులు ప్రయత్నించగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలా మంది మృతి చెందారు. బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కరసేవకులు కూలగొట్టడంతో ఈ వివాదం విస్ఫోటనంగా మారింది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది చనిపోయారు. ఆ ఉదంతం తర్వాత అయోధ్యలోని భూ యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్ట్.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని తామే శుభ్రం చేయాల్సి ఉందని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.


 


అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని, అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని 2010 సెప్టెంబర్ 30న తీర్పు చెప్పింది. అందులో మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది. అక్కడ ఉన్న  దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదును నిర్మించారని పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. 


 


అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత... ఆ స్థలంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని హిందువులు ఆశించారు. ముస్లింలు మాత్రం మసీదును పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో అత్యున్నత ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. మరోసారి వాదనలు విన్నది. సుప్రీం న్యాయమూర్తులు ఆగస్టు 6వ తేదీ నుంచీ 40 రోజుల పాటు కేసును విచారించారు. మసీదు నిర్మించిన స్థలం.. రాముడి జన్మస్థలమని, 16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారని హిందువులు వాదించారు. ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామని, అయితే ఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి.. మసీదులో పెట్టారని ముస్లింలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాతే ఆ విగ్రహాలను పూజించటం మొదలైందని వాదించారు. ఈ కేసును సుదీర్ఘ కాలంగా విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2019, నవంబర్ 09వ తేదీ శనివారం  తీర్పును వెలువరించనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa