అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణ నినాదంతోనే రాజకీయంగా కమలం పార్టీ ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1980వ దశకం తర్వాత అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా ఇంతటి ప్రాచుర్యం రావడానికి బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి కృషే కారణం. నాడు వారు చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీం తీర్పుపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీ స్వాగతించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పుపై ఒకింత భావోద్వేగానికి గురైన ఆయన ఇది కల నెరవేరిన క్షణమని పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ సంపదల్లో రామజన్మభూమికి గౌరవమైన స్థానం ఉందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. అంతేకాదు కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో రామజన్మభూమికి పవిత్ర స్థానం ఉందని అద్వాణీ ఉద్ఘాటించారు. వారి నమ్మకాలకు గౌరవం చేకూరేలా వచ్చిన ఈ తీర్పు ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదం ముగిసిన తరుణంలో ఎలాంటి హింసకూ చోటివ్వకుండా శాంతిని నెలకొల్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ క్రమంలో దేశ ఐక్యతను, సమగ్రతను బలపర్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై పని చేయాలని అద్వాణీ పిలుపునిచ్చారు. అలాగే, మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీం చెప్పడం కూడా హర్షణీయమని స్వాగతించారు. అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం కోసం ఎల్‌కే అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. సరిగ్గా ఆయన 92వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మర్నాడే ఈ తీర్పు వెలువడటం విశేషం. 1990 అక్టోబర్ 23న రథయాత్రలో భాగంగా బీహార్లోని సమస్తిపూర్ మీదుగా వస్తున్న అద్వానీని అప్పటి లాలూ ప్రభుత్వం అడ్డుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజకీయాలను ఈ సంఘటన కీలక మలుపు తిప్పడడమే కాదు, బీజేపీకి పాపులారిటీని తీసుకొచ్చింది. అద్వానీ అరెస్టుతో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల మత ఘర్షణలు చెలరేగాయి. అద్వానీ అరెస్టుకు నిరసనగా కేంద్రంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ మద్ధతు ఉపసంహరించుకోవడంతో వీపీ సింగ్ సర్కారు కూలిపోయింది. అక్టోబర్ 30న వేలాదిగా అయోధ్యకు బయలుదేరిన కరసేవకులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. ఓ వెయ్యి మంది మాత్రమే అయోధ్యకు చేరుకుని, మసీదులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కరసేవకులపై యూపీ పోలీసులు కాల్పులకు పాల్పడటంతో 28 మంది చనిపోయారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు వీహెచ్పీ, బీజేపీ అయోధ్యలో కరసేవకుల ర్యాలీ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 6న జరిగిన ఈ ర్యాలీలో 1,50,000 మంది కరసేవకులు పాల్గొని, బాబ్రీ మసీదులోకి చొచ్చుకెళ్లారు. తర్వాత ర్యాలీ అదుపు తప్పి, హింసాత్మకంగా మారింది. కరసేవకులు మసీదును కూల్చేశారు. ఈ కేసులో పోలీసులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్ సహా పలువురు నేతలపై చార్జిషీట్ దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa