తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత, ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం అనంతపురంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో టీడీపీ నాయకుడు ముక్తియార్, ఆయన అనుచరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని, ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ శాఖలను అడ్డుపెట్టుకుని ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ శ్రేణులను లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇంటి గొడవల వరకు పోలీసులు జోక్యం చేసుకుని పంచాయతీలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో అమాయక ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ నేతలే బహిరంగంగా ఆస్తులు కాజేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, రాప్తాడు వంటి నియోజకవర్గాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇంటి పెద్దలు మరణిస్తే వారి ఆస్తులపై కన్నేసి అధికార పార్టీ నేతలు కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార పార్టీ అరాచకాలను డైవర్ట్ చేయడానికే ఇటీవల గుల్జార్‌పేటలో దిమ్మె తొలగింపు పేరుతో వైసీపీ నాయకుడిని అరెస్టు చేశారని చెప్పారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ నేతలతో సీఐ స్థాయి అధికారి అనుచితంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa