దేశమంతటా విస్తరించిన శ్రీవారిసేవకులు ఆయా ప్రాంతాల్లో హైందవ సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి పిలుపునిచ్చారు. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌లో శనివారం ఉదయం జరిగిన సత్సంగంలో స్వామీజీ శ్రీవారి సేవకులకు అనుగ్రహ భాషణం చేశారు. శారద పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొన్నారు.
దేశం నలుమూలల నుండి పేద, మధ్య తరగతి భక్తులు ముడుపులు కట్టుకుని శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వస్తున్నారని, అలాంటివారికి సేవచేస్తే సాక్షాత్తు భగవంతునికి సేవ చేసినట్లేనని స్వామీజీ ఉద్ఘాటించారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి భక్తులకు సేవ చేసేందుకు దూరప్రాంతాల నుండి విచ్చేస్తున్న శ్రీవారి సేవకులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఇంతమంది శ్రీవారి సేవకులను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తిమార్గాల్లో సేవకు విశేష ప్రాధాన్యం ఉందని, సత్సంగత్వంతో జీవన్ముక్తి లభిస్తుందని వివరించారు. మోక్షాన్ని ప్రసాదించే ఏకైక దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అని, స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులు, సేవకులు ఉన్నారని తెలియజేశారు. మానవసేవతోపాటు వేదపరిరక్షణ, గోసంరక్షణ, వన్యప్రాణి రక్షణ, అటవీ రక్షణకు టిటిడి కృషి చేస్తోందని కొనియాడారు.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు అనుగ్రహ భాషణం చేసేందుకు స్వామీజీ విచ్చేయడం మహాభాగ్యమన్నారు. 2000వ సంవత్సరంలో 200 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటివరకు 12 లక్షల మందికిపైగా సేవకులు సేవలందించారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, వేసవి సెలవులు వంటి రద్దీ రోజుల్లో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలందిస్తున్నారని, టిటిడిలోని కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. శ్రీవారి సేవకులు మరింత సేవాస్ఫూర్తితో భక్తుల సేవలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ముందుగా సేవాసదన్‌కు చేరుకున్న శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామివారికి, శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి మాట్లాడుతూ శ్రీవారి సేవ వ్యవస్థ ఆవిర్భావం, సేవకులు అందిస్తున్న సేవలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను స్వామీజీలకు వివరించారు. సత్సంగంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు చక్కటి భజన కార్యక్రమం నిర్వహించారు.