మహారాష్ట్రలోని సతరా జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కోయ్నా రీజియన్ లో ఉదయం 6:42 గంటలకు భూమి కంపించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.6గా నమోదైంది. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కోయ్నా డ్యామ్ కు 8 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు పేర్కొన్నారు.మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలోనూ ఈ నెల 14వ తేదీన భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. దహను తాలుకాలోని దుండల్‌వాడి గ్రామంలో 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ఆ గ్రామంలో భూమి కంపించిన మాట వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 5:22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. 13వ తేదీ మధ్యాహ్నం 12:26 గంటలకు తొలిసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు కాగా, ఆ రోజు రాత్రి 9:55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఈ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa