ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు,లోకేశ్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : అవంతి శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 11:42 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేశ్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. లోకేశ్‌ వల్లే  టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట నిజం కాదా?  చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేశే కదా? అని ఆయన వ్యాఖ్యానించారు.


లోకేశ్ నాయకత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యేలలో‌ ఒక్కరైనా ఒప్పుకుంటారా? అని అవంతి ప్రశ్నించారు. లోకేశ్ చేస్తున్న విమర్శలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అన్ని వనరులున్న విశాఖపట్నాన్ని గతంలోనే చంద్రబాబు రాజధానిగా ప్రకటించి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవకాశం ఉండేదని ఆయన చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని‌ తాము మూడు రాజధానులు ప్రకటించామని, దీన్ని కుట్రలతో అడ్డుకున్నారని ఆయన చెప్పారు. విశాఖపట్నం భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.


జగన్ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన చెప్పారు. తమ సర్కారుపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ సర్కారు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలు కూడా  చెల్లించిందన్నారు. జులై 7 న ఏపీలో 27 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీల్లో తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa