పరీక్షల్లో ఫెయిలయ్యామని విద్యార్దులు,ఉద్యోగం రాలేదని కొందరు,ఉన్న ఉద్యోగం పోయిందని ఇంకొందరు, మానసిక వేదనతో కొందరు, ఒంటరితనంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షనికావేశంలో తమ జీవితానికి ముగింపు పలుకుతున్నారు. సామాన్య మానవుని నుంచి సెలబ్రిటీల వరకు ఏదో కారణంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నలుగురికి మంచి చెప్పి చివరకు వారే కనుమరుగయ్యారు. తాజాగా సినీ హీరో సుశాంత్ మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రతి మనిషికి కష్టాలు సాధారణమే. కష్టాలు వచ్చినప్పుడే మనిషి మరింత రాటుదేలాలి. గుండె ధైర్యంతో ముందుకు సాగాలి. అప్పుడే అన్నింటిని తలదన్ని జీవితాశయాలను సాధించగలం. కొన్ని కష్టాలకే కుంగిపోతే జీవితం సాగించడం కష్టం. తెగింపుతో ముందుకు పోవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లాక్ డౌన్ తర్వాత ఆర్దిక కష్టాలతో మరియు ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో అందమైన జీవితాన్ని చిద్రం చేసుకుని నమ్ముకున్న వారికి అన్యాయం చేయవద్దు. సమస్యలు లేనిది ఎవరికి..మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్ని సమస్యలే. గొప్ప గొప్ప వారు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చిన వారే. ఆ విషయాలు తెలుసుకొని ముందుకు సాగాలి. భారత మేధావి,మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైకిల్ తొక్కుతూ పేపర్లు వేసి తన మేధా శక్తితో శాస్త్రవేత్తగా,రాష్ట్రపతిగా ఎదిగాడు. పేపర్లు వేసినప్పుడు అవమానంగా ఫీలయ్యి కలాం కుంగిపోతే శాస్త్రవేత్త అయ్యేవాడా..రాష్ట్రపతిగా ఎదిగేవాడా. ప్రతి మనిషి ఇంకొక మనిషితో పోల్చుకోకూడదు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి,జంతువు,పశు పక్షాదులన్నింటికి కూడా ఒక్కో దానికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎవరి టాలెంట్ వారిది. అంతే కానీ ఒకరితో పోల్చుకొని మానసికంగా కుంగిపోకూడదు. కష్టం వచ్చినా,కోపం వచ్చినా ప్రశాంతత చాలా అవసరం. ఓపికతో ముందుకు సాగితే అన్ని విజయాలే లభిస్తాయి. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. కాబట్టి అంతా ఆత్మహత్య అనే ఆలోచనను మనస్సులో నుంచి తీసేయాలి. ఇటీవల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా కాకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తే లాభం ఉంటుంది. ప్రతి మనిషి నిత్యం వ్యాయమం చేస్తే బాగుంటుంది. వాకింగ్,రన్నింగ్,పిల్లలతో ఆటలు ఆడడం చేస్తే ఒత్తిడిని జయించవచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల విటమిన్లు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం చురుగ్గా పని చేస్తుంది. ఇష్టమైన ఆహారం తీసుకుంటే సంతృప్తికరంగా ఉంటుంది. బీపీ,షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకుంటే టెన్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. నిత్యం ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. యోగా కూడా చాలా ముఖ్యమైనది. నిరంతరం పని చేస్తున్న ప్రశాంతత ఉండదు. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. తిరగాలనిపించిన ప్లేస్ లు,ఆలయాలు,ఊర్లు వెళ్లి రావాలి. ప్రకృతిలో సరదాగా గడపాలి. నీకు ఏదనిపిస్తే అది చేయాలి. ఒకరి గురించి పట్టించుకోకూడదు. ముందు నువ్వు నీ ఫ్యామిలీ. తర్వాతే ఎవరైనా అనే విధంగా ఉండాలి. పుస్తకాలు చదువుతూ ఉండాలి. గొప్ప గొప్ప వారి చరిత్రలు తెలుసుకోవాలి. సక్సెస్ స్టోరీలు చదవాలి. ఎన్ని కోట్లున్నా,ఎన్ని ఆస్తిపాస్తులున్నా మనిషిని ఒంటరితనం చిత్తు చేస్తుంది. మనిషి ఒంటరిగా బతకలేడు. అందుకే ప్రతి నిమిషం నలుగురితో గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ తో మరియు బంధువులతో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఫంక్షన్లు అయినప్పుడు తప్పకుండా హాజరవ్వాలి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతుండాలి. రూంలలోనే ఎక్కువగా గడపకూడదు. టీవీల ముందు,ల్యాప్ ట్యాప్ ల ముందు ఎక్కువగా గడపకూడదు. అన్నింటికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోవాలి. కష్టాలు వచ్చినప్పుడు చావు పరిష్కారం కాదు. దీనిని తెలుసుకొని అంతా ముందుకు పోవాలి. చావాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీకు ఇష్టమైన వారితో ఓ సారి మాట్లాడడండి. ఉదాహరణకు ఓ ప్రేమికునికి తన ప్రేమికురాలితో మాట్లాడితే బతకాలన్న ఆలోచన కలుగొచ్చు. పెద్దవారు తమ పిల్లలతో మాట్లాడితే మారొచ్చు. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం. అంతే తప్ప బాధపడాల్సిన,భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికెన్ని ఉన్నా అందరూ చేసేది బతుకు కోసమే. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ బతుకుతారు. ఒక ఉద్యోగం పోయినంత మాత్రాన ఇంకో ఉద్యోగం ఉండదా. నువ్వు నీ శ్రమను,నీ టాలెంట్ ను నమ్ముకో. అవకాశాలు వాటంతటా అవే వచ్చి మిమ్ముల అందుకుంటాయి. ఎవరైనా రాత్రికి రాత్రే కోటిశ్వరులు కారు. స్టార్ లు కారు. కొంత సమయం పడుతుంది. కష్టపడుతూ ఆ సమయం కోసం వేచి చూస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అంతా ఆత్మహత్య అనే ఆలోచనను దగ్గరకు రానీయకుండా పూర్తి జీవిత కాలం జీవించాలని కోరుకుంటున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa