ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడాలి-సీపీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 11:58 PM

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు 26వ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో సోమవారం ప్రవేశపెట్టారు. తీర్మానం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ''రాష్ట్రానికి బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన తీరని ద్రోహాన్ని తిప్పికొట్టి, ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం, రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నంపోర్టు, రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర విద్యాలయాలకు నిధులు సాధించుకోవడానికి సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం 26వ రాష్ట్ర మహాసభ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. విభజనానంతరం ప్రత్యేకహోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం దగాచేసింది. మరోవైపు ఎన్‌ఆర్‌సి, రామజన్మభూమి, కశ్మీర్‌, మతమార్పిడుల పేరుతో ప్రజల మధ్య చీలికలు తెస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. బిజెపి విద్రోహ, విద్వేష రాజకీయాలను ఎదుర్కోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లంగిపోతోంది. 25మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్‌ హామీ గాల్లో కలిసిపోయింది. వైసిపి, టిడిపి పోటీపడి కేంద్రానికి వత్తాసునిస్తుండడంతో రాష్ట్రంలో మతోన్మాద బిజెపి పేట్రేగిపోతోంది. మనరాష్ట్రం హక్కుల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని పక్షాలను కలుపుకుని కేంద్రంపై పోరాడాలి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని ఈ మహాసభ డిమాండ్‌ చేస్తోంది. టిడిపి, జనసేన పార్టీలు బిజెపి మతోన్మాద ఎజెండా నుండి విడగొట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలకు అండగా నిలవాలని మహాసభ విజ్ఞప్తి చేస్తోంది. రాజధాని వివాదానికి స్వస్తి చెప్పి విభజనానంతరం వైసిపి సహా రాజకీయ పార్టీలన్నీ వచ్చిన ఏకాభిప్రాయాన్ని గౌరవించి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, కర్నూలులో హైకోర్టు పెట్టాలని మహాసభ డిమాండ్‌ చేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ 10నెలలుగా సాగిస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తక్షణం ఆపాలి. పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా కేంద్రం బాధ్యతారహితంగా తప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఆదివాసీ ప్రజలను గెంటేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. వారి ఆందోళనలకు ఈ మహాసభ సంఘీభావం ప్రకటిస్తోంది. త్వరితగతిన పునరావాసం పూర్తిచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. రాష్ట్రంపట్ల కేంద్రం వివక్షత, విద్రోహపూరిత దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా సకల పక్షాలు ఏకమై పోరాడాలని ఈ మహాసభ పిలుపునిస్తోంది. వైసిపి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నవరాత్నాల పేరుతో సంక్షస్త్రమ పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలకు కూడా కోతలు పెడుతోంది. మరోవైపు వీటితోనే అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయన్న భ్రమలు సృష్టించి అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ధరలు, పన్నులు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతోంది. జగన్‌ పాదయాత్ర సందర్భంగా వివిధ తరగతుల, ప్రాంతాల ప్రజలకిచ్చిన హామీలను విస్మరించింది. ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కింది. నాడు ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటానని, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడతానని చెప్పి, నేడు అదే టిడిపి బాటలో నిరంకుశంగా అణచివేస్తోంది. ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి. అని ఆ తీర్మానం లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa