ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణకోసం డిజిటల్‌ సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 02:07 PM

32 మంది ప్రాణత్యాగం, 66 గ్రామాలు, 16500 మంది రైతులు 22వేల ఎకరాల భూమి త్యాగంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌వారి చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎయు జర్నలిజం డిపార్టుమెంట్‌ హెడ్‌ ప్రొ॥డి. వి. ఆర్‌. కె. మూర్తి తెలిపారు. బుధవారం ఆంధ్రా యూనివర్శిటీ జర్నలిజయం డిపార్టుమెంట్‌లో కోటి సంతకాల సేకరణలో భాగంగా డిజిటల్‌ సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌ను ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఉండటం వల్లే విశాఖపట్నం అభివృద్ధి చెందిందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉండటంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.


సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ చైర్మెన్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్‌. నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ విశాఖఉక్కు ` ఆంధ్రుల హక్కు అనే నినాదం నాడు యూనివర్శిటీ విద్యార్ధులే కీలకపాత్ర పోషించి ఉద్యమం నడిపారని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకపోగా ఉన్న ప్లాంట్‌ను అమ్మేస్తామని బరితెగిస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ తన సొంత నిధులతో విస్తరణ పనులు చేపట్టి అదనపు ఉత్పత్తి చేసి అదనంగా వేలాదిమందికి ఉపాధి కల్పించిందన్నారు. ప్రభుత్వరంగం ఉంటే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కోటి సంతకాలు సేకరణ రాష్ట్ర వ్యాప్తింగా జరుగుతుందని, ఉద్యోగస్తులు, మేధావులు కూడా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనేందుకు వీలుగా ఈ డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించామన్నారు.


ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌. కె. ఎస్‌. వి. కుమార్‌, 78వవార్డు కార్పొరేటర్‌, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి. గంగారావు, సోషల్‌మీడియా కో కన్వీనర్‌, ఎయు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఎన్‌. అజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa