ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న ప్రయత్నం.. యువతికి గిన్నిస్‌ రికార్డ్స్‌

international |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 12:00 PM

ఆమె చేసిన చిన్ని ప్రయత్నం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆ యువతి గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ అమ్మాయి పేరే లిజిచి. చైనాకు చెందిన లిజిచి ఆ దేశంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న యూట్యూబర్‌ గా నిలిచింది. చుట్టూ పర్వతాలు, కొండల మధ్యనున్న ఓ మారుమూల పల్లె ఈమెది. లిజిచి చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. నాన్న దగ్గర పెరుగుతున్న ఆమెకు కొద్దికాలానికే తండ్రి దూరమయ్యారు. దీంతో నాన్నమ్మ, తాతయ్యలు చేరదీశారు. ఆమె తాత చుట్టుపక్క ప్రాంతాల్లో పేరున్న చెఫ్‌. దీంతో లిజిచి కూడా చిన్నతనంలోనే సంప్రదాయ విధానంలో వంటకాలు చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది.


ఆమెకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తాత మరణించాడు. దీంతో లిజిచి కుటుంబ పోషణ కోసం చదువు మానేసి కూలి పనులకు వెళ్లింది. తరువాత ఎలక్ట్రిక్‌, వెయిటర్‌ వంటి పనులు చేసింది. నాన్నమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి సొంతూరికి వచ్చేసింది. ఇంట్లో ఉంటూనే పొలం పనులు చేసేది. తనకు ధైర్యాన్నిచ్చే వాళ్లు కొద్దిరోజులకే దూరమవుతూ రావడం ఆమెకు ఆందోళన కలిగించేది. ఆ విషయాన్నే ఓరోజు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె మనసు కాస్త తేలికపడ్డట్టుగా అనిపించింది. తర్వాతి నుంచి తన రోజువారీ పొలం పనులను ఆమె వీడియో తీసి పోస్ట్‌ చేసింది. చిన్న వయసులోనే ఎవరి సాయం లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తోందంటూ ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో తాత నేర్పిన కిటుకులతో సాగుపద్ధతులపై వీడియోలు రూపొందించేది. ఆపై సంప్రదాయ వంటకాల్నీ పరిచయం చేసింది.


లిజిచి చేనేత వస్త్రాలను కూడా తయారు చేస్తుంది. ఆ దుస్తులే ధరిస్తుంది. యంత్రాల సాయం లేకుండా చేతులతోనే అందమైన డిజైన్లు రూపొందిస్తుంది. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేస్తుంది. ఆహారమైనా, ఇంట్లో వస్తువులైనా సేకరించడం దగ్గర్నుంచి పూర్తి చేయడం వరకూ అన్నింటినీ పొందుపరుస్తుంది. తన వీడియోలకు ఆదరణ, ఆదాయం వస్తుండటంతో ముగ్గురితో ఓ టీం ను ఏర్పాటు చేసుకుంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ను కోటి 66 లక్షల మందికిపైగా సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. చైనీస్‌ భాషలో ఇంత మంది సబ్‌స్క్రైబర్లున్న తొలి యూట్యూబర్‌ తనే. అందుకే గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డులో ఆమెకి చోటు దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa