టీటీడీ పాలకమండలి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. పాలకమండలి తీర్మానాలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా గోప్యత పాటించడంపై బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీకి లీగల్ నోటీసులు పంపారు.
దీంతో టీటీడీ అధికారులు నష్ట నివారణ చర్యలకు దిగారు. 2009 నుంచి టీటీడీలో పాలన గాడితప్పింది. పారదర్శతకు చెక్ పెట్టేలా అప్పటి పాలకులు నిర్ణయాలు తీసుకోవడంతో సమాచార హక్కు పరిధిలో ఉన్న టీటీడీని చట్టం పరిధి నుంచి తప్పించారు. అప్పటి నుంచి పాలన కారణాల పేరుతో మీడియాను అనుమతించడం నిలిపివేశారు.
టీటీడీ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. ఇలా పారదర్శకతను పక్కదారి పట్టించే నిర్ణయాలు అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. విమర్శలను పరిగణలోకి తీసుకుని తప్పులు సరిదిద్దుకోవాల్సిన టీటీడీ తమపై విమర్శలు రాకుండా రహస్య పరిపాలనకు అప్పట్లోనే తెరలేపింది. అదే సంప్రదాయాన్ని 12 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి తెచ్చారు. ఏడాదిన్నర క్రితం టీటీడీకి భక్తులు విరాళంగా అందించిన కొన్ని భూములను విక్రయించడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. అయితే పాలక మండలి రహస్యంగా తీసుకున్న నిర్ణయాలు బయటకు రావడం వెనుక పెద్ద కుట్రే ఉందంటూ అప్పటి జేఈవో తప్పుడు నివేదిక సమర్పించారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్లో పెట్టవద్దనే నిర్ణయం తీసుకోవడంతో టీటీడీ కూడా అదే నిర్ణయాన్ని అనుసరించింది. ఇప్పటికీ టీటీడీ సమాచారహక్కు పరిధిలో కూడా లేకపోవడంతో అసలు టీటీడీలో ఏం జరుగుతోందన్న ఆందోళన భక్తుల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై గత నెల 21న బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి టీటీడీకి లీగల్ నోటీసులు పంపారు. 15 రోజులలోపు పాలకమండలి తీర్మానాలను వెబ్ సైట్‌లో పెట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. దీంతో టీటీడీ ఉన్నతాధికారులు పాలకమండలిలో చర్చించి తీర్మానాలను వెబ్ సైట్‌లో పెట్టేందుకు ఆమోదం పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa