ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానంతో దారుణం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 01:26 PM

భార్యాభర్తల మధ్య అనుమానం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించకూడదు. ఒక్కసారి అనుమానానికి అవకాశం ఇస్తే.. ఒకరిపై ఒకరికి అపనమ్మకం కారణంగా ఆ కాపురంలో కలతలు ఏర్పడతాయి. ఆ అనుమానం పెను భూతంగా మారి సంసారం ఛిన్నాభిన్నమవుతుంది. బెంగళూరులో నివసిస్తున్న ఓ జంట విషయంలో అదే జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై, 13 ఏళ్ల కూతురిపై సలసల కాగుతున్న నూనె పోసి అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోరమంగళ ప్రాంతానికి సమీపంలోని ఎల్‌ఆర్ నగర్‌కు చెందిన ఆంటోనియమ్మ(35), థామస్ (38) భార్యాభర్తలు. థామస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ భార్యాభర్తలకు 13 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. భార్యా, కూతురిని కొన్నాళ్లు బాగానే చూసుకున్న థామస్‌కు ఇటీవల తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతోందన్న అనుమానం కలిగింది. ఆ అనుమానంతోనే భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మద్యానికి బానిసగా మారాడు. రోజూ తాగొచ్చి భార్యను తిట్టికొట్టి హింసించేవాడు. కూతురిని కనీసం ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు కూడా కాదు. ఆటో డ్రైవింగ్‌కు వెళ్లడం మానేశాడు. రోజూ ఇంట్లోనే ఉంటూ భార్యకు మరింత నరకం చూపించేవాడు. అమ్మను కొట్టొద్దని అడ్డు పడినందుకు కూతురిని కూడా కొడుతూ బాధపెట్టేవాడు.


థామస్ అనుమానపు ఆగడాలు ఇంతటితో ఆగలేదు. జనవరి 30న ఆదివారం ఉదయం తాగి ఇంటికొచ్చిన థామస్ భార్యతో గొడవ పడ్డాడు. అయితే.. ఇరుగుపొరుగు వారు థామస్‌కు బుద్ధి చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికొచ్చాడు. భర్త ఇంటికొచ్చే సమయానికి ఆంటోనియమ్మ కూతురితో కలిసి టీవీ చూస్తోంది. వాళ్లను పలకరించకుండానే థామస్ నేరుగా వంట గదిలోకి వెళ్లాడు. వంట చేసే నూనెను పాత్రలో పోసి బాగా కాగబెట్టాడు.ఓ కర్ర తీసుకుని భార్యను కొట్టాడు. ఆమెకు బలంగా గాయం కావడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలో ఉన్న ఆమెపై సలసలా కాగుతున్న ఆ నూనెను తీసుకొచ్చి పోశాడు. ఆమె ముఖంపై, ఛాతిపై, కడుపుపై, కాళ్లూచేతులపై కాగుతున్న నూనెను పోశాడు. తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన కూతురిపై కూడా ఆయిల్ పోశాడు. ఈ ఘటనలో తల్లీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చేసరికి థామస్ అక్కడ నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు హుటాహుటిన తల్లీకూతురిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అనుమానంతో భార్యపై కాగుతున్న నూనె పోసిన నేరానికి థామస్ కటకటాల్లో ఊచలు లెక్కించబోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa