ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లత మంగేష్కర్ తో ఆ క్రికెటర్ ప్రేమలో పడ్డారు: బికనీర్ రాజకుమారి రాజశ్రీ

national |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 05:00 PM

గాన కోకిల లతా మంగేష్కర్ జీవితంలోని ఆసక్తికర అంశాలు ఇపుడు బికనీర్ రాజకుమారి రాజశ్రీ పుస్తకంలో దర్శనమిస్తున్నాయి. ఇదిలావుంటే లతా మంగేష్కర్ ఈ లోకాన్ని వీడిపోవడం ఆమె అభిమానులను విషాదంలో ముంచెత్తింది. లత స్మృతులకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా, ఆమె అవివాహితగా ఉండడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి బికనీర్ రాజకుమారి రాజశ్రీ తన పుస్తకంలో ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇప్పుడీ పుస్తకంలోని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. లతా మంగేష్కర్... నాటితరం క్రికెట్ ప్రముఖుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ తో ప్రేమలో పడ్డారు. అదెలాగంటే... లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ క్రికెట్ అభిమాని. క్రికెట్ పై అనురక్తి దుంగార్పూర్, హృదయనాథ్ ల మధ్య స్నేహానికి కారణమైంది. ఇక, హృదయనాథ్ కోసం తరచుగా రాజ్ సింగ్... లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లేవారు. ఆ విధంగా లతతోనూ దుంగార్పూర్ కు పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం జరిగాయి. ఇదంతా దుంగార్పూర్ లో న్యాయశాస్త్రం చదివేందుకు ముంబయిలో ఉన్నప్పటి సంగతి. వాస్తవానికి రాజ్ సింగ్ దుంగార్పూర్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. వారిది రాజస్థాన్. లా చదివేందుకు ముంబయి వచ్చారు. అక్కడే క్రికెటర్ గానూ ఎదిగారు. ఇక, చదువు పూర్తికావడంతో ఆయన రాజస్థాన్ తిరిగి వెళ్లిపోయారు. లతాను మాత్రం మర్చిపోలేదు. తన ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. పెళ్లంటూ చేసుకుంటే రాజకుటుంబానికి చెందిన అమ్మాయినే చేసుకోవాలని పట్టుబట్టారు. దాంతో ఆయన లతపై ప్రేమను చంపుకోలేక, ఇటు కుటుంబ సభ్యుల మనసు కష్టపెట్టలేక జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. దుంగార్పూర్ 2009లో మరణించారు. ఆయన 16 ఏళ్లపాటు దేశవాళీ క్రికెటర్ గా కొనసాగారు. బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశారు. జాతీయ జట్టుకు రెండు పర్యాయాలు సెలెక్టర్ గానూ వ్యవహరించారు. సచిన్ టెండూల్కర్ వంటి మేలిమి వజ్రాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది దుంగార్పూరే. ఆయన ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీయే 16 ఏళ్ల సచిన్ లోని ప్రతిభను గుర్తించి టీమిండియాకు ఎంపిక చేసింది. అంతేకాదు, భారత జట్టుకు నాలుగు విదేశీ పర్యటనల్లో మేనేజర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతటి ప్రముఖుడు ప్రేమను మాత్రం గెలిపించుకోలేకపోయారు. లతా మంగేష్కర్ ను ఆయన ఎంతో ప్రేమగా మిథూ అని పిలిచేవారట. బికనీర్ రాజకుమారి రాజశ్రీ ఈ విషయాన్ని కూడా తన పుస్తకంలో వెల్లడించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... భారత జట్టు 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో వరల్డ్ కప్ గెలవడం చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. ఆ సమయంలో కప్ గెలిచిన ఆటగాళ్లకు నజరానా అందించేందుకు నిధులు సేకరించాలని భారత క్రికెట్ పెద్దలు నిర్ణయించారు. అందుకోసం లతా మంగేష్కర్ తో పాట కచేరీ ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికి బోర్డులో అధికారిగా ఉన్న దుంగార్పూర్ ఈ విషయాన్ని లతాతో చెప్పగా ఆమె సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా బోర్డుకు రూ.20 లక్షలు రాగా, ఒక్కో ఆటగాడికి లక్ష రూపాయల వరకు ఇచ్చారట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... దుంగార్పూర్ మరణించినప్పుడు లతా మంగేష్కర్ ఆయనను కడసారి చూసేందుకు ఎంతో రహస్యంగా వెళ్లి వచ్చారని ప్రచారం జరిగింది. ఏదేమైనా, దుంగార్పూర్ మాత్రమే కాదు, అటు లతా మంగేష్కర్ కూడా పలు కారణాలతో అవివాహితగానే మిగిలిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa