బీజింగ్: టిబెట్‌లో 409 కిలోమీటర్ల పొడవైన నూతన ఎక్స్‌ప్రెస్ రహదారిని చైనా ఆదివారం ప్రారంభించింది. సుమారు రూ.37 వేల కోట్లతో నిర్మించిన ఈ రహదారి.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలోని న్యింగ్‌చి నగరాన్ని టిబెట్ రాజధాని లాసాతో కలుపుతుంది. ఫలితంగా రోడ్డుమార్గంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మూడు గంటలు తగ్గనుంది. నూతన రహదారిపై భారీ ట్రక్కుల ప్రయాణాన్ని తాత్కాలికంగా నిషేధించారు. సైనిక సామగ్రి రవాణాకు ఈ మార్గం అత్యంత అనుకూలంగా ఉండటం గమనార్హం. మరోవైపు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సేవలందించేందుకుగాను లాసాలో గగనతల అంబులెన్స్ కేంద్రాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం ప్రారంభించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వైద్య పరికరాలతో కూడిన రెండు హెలికాప్టర్లు ఈ కేంద్రంలో నిరంతరం సిద్ధంగా ఉంటాయని తెలిపారు. రోగులను ఇవి 600 కిలోమీటర్ల వరకు చేరవేయగలవని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa