ఎల్ల వేళలా ఉద్యోగ ధర్మానికి కట్టుబడి పని చేయాలని, ఉత్తమ సేవకులుగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని పోలీసు, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఉద్యోగులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. అందిరితో పాటు మనం అని కాకుండా అందిరిలో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే తపనతో పని చేయాలని సూచించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా గానీ ఉద్యోగ వ్యవహారాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోరాదని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఉద్యోగుల శిక్షణా తరగతుల ప్రారంభం నిమిత్తం స్థానిక పోలీసు శిక్షణా కళాశాలలో మంగళవారం ప్రత్యేక సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి హాజరై ప్రసంగించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసు శిక్షణా కళాశాలకు ప్రత్యేకత గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఉత్తమ బోధకులచే అందించే శిక్షణలో ఉద్యోగ నిర్వర్తనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలని ఉద్యోగులకు కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే ప్రతి అంశంపైనా తర్ఫీదు పొందాలన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరిన తర్వాత మానవతా విలువలతో కూడిన సేవలందించాలని చెప్పారు. ఆత్మ సంతృప్తి చెందేలా పని చేయాలని, ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించిన రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పరాదని సూచించారు. మానవతా దృక్ఫథం అలవర్చుకోవాలని, ప్రజల పట్ల గౌరవం భావం కలిగి ఉండాలని, తోటి ఉద్యోగుల పట్ల సోదర భావాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పారు. విజయనగరం జిల్లా చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లా ఇక్కడ ఎన్నో అంశాలు నేర్చుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa