రష్యా దళాలు దోపిడీ, అత్యాచారాలుతో ఉక్రెయిన్ పై అరాచకాలకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళా ఎంపీ విమర్శించారు. రష్యా సైనికుల దారుణ చర్యలను ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్ వెలుగులోకి తీసుకొచ్చారు. పదేళ్ల బాలికలపైనా రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నారని.. వారి మృతదేహాలను పరిశీలించినప్పుడు యోని, మల ద్వారాలపై గాయాలున్నట్టు ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మహిళల మృతదేహాలపై కాల్చినట్టు స్విస్తిక్ గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యా దళాలు దోపిడీ, అత్యాచారాలు చేస్తూ ఉక్రెయిన్ ప్రజలను చంపేస్తున్నాయంటూ.. రష్యాను అనైతిక నేరాల దేశంగా ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో సోమవారం లెసియా వసిలెంక్ ట్వీట్ పోస్ట్ చేశారు. తన ఆరోపణలకు ఆధారంగా ఒక ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది’’ అని ట్వీట్ ఆమె చేశారు.