అమెరికా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు వైట్ హౌస్ (అధ్యక్ష కార్యాలయం) లో ఉండి వెళ్లిన బరాక్ ఒబామా.. చాలా కాలం తర్వాత మరోసారి మంగళవారం అక్కడికి వెళ్లనున్నారు. 2017లో అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత ఒబామా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కానుంది. ‘‘లక్షలాది మంది అమెరికన్లకు అందుబాటు ధరకే అందిస్తున్న ‘అఫర్డబుల్ కేర్ యాక్ట్ అండ్ మెడిక్ ఎయిడ్’ విజయోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో కలసి ఒబామా పాల్గొంటారు’’ అంటూ వైట్ హౌస్ అధికారి ప్రకటించారు. అఫర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను ఒబామా హయాంలోనే ప్రారంభించారు. దీని బలోపేతానికి అధ్యక్షుడు బైడెన్ మరిన్ని చర్యలు తీసుకుంటారని, కుటుంబాలకు మరిన్ని డాలర్లను ఆదా చేయడమే దీని లక్ష్యమని వైట్ హౌస్ అధికారి పేర్కొన్నారు.