పంటి నొప్పి వస్తే తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన అంటూ ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి 26 జిల్లాలు కార్యకలాపాలు షురూ చేసిన నేపథ్యంలో ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పంటి నొప్పి వస్తే తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన అంటూ ధ్వజమెత్తారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీసి ఇదే అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తేనే పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ అయితే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి, మొత్తం 175 జిల్లాలుగా చేస్తే అది మరింత పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ అనిపించుకుంటుందేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "పాలనా వికేంద్రీకరణ అంటే అది కాదు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్ లకు, జిల్లా పరిషత్ లకు, నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లకు విధులు, నిధులు, అధికారాలు బదలాయించి అవి స్వయంపాలన సాగించేట్టు చేస్తే అది నిజమైన పాలనా వికేంద్రీకరణ అవుతుంది. అలాకాకుండా, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, సర్పంచిలను, మిగతా స్థానిక సంస్థల ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేసి ఇది పాలనా వికేంద్రీకరణ అంటే ఎలా? ఇక అభివృద్ధి వికేంద్రీకరణ చూస్తే, మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. వ్యవసాయానికి ప్రధానమైనది సాగునీరు. అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగోడు, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. అంతే తప్ప, 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే అది పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ అనిపించుకోదు" అని తులసిరెడ్డి హితవు పలికారు.