ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కుక్కకు ఏకంగా రాజయోగం పట్టింది

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 02:01 PM

రాజయోగం అంటే ఒక్కో విషయంలో ఒక్కోలా అర్థంచేసుకోవచ్చు. ఇక్కడ ఓ కుక్కకు రాజయోగం పట్టింది. చాలామంది కుక్కలను పెంచుకోవడమే కాదు.. వాటిని సొంత బిడ్డల్లాగే చూసుకుంటున్నారు. వాటితో విడదీయలేని బంధాన్ని పెంచుకుంటున్నారు. వాటి కోసం ఏమైనా చేస్తున్నారు. అలాగే ఆ మూగజీవాలు కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో, ప్రేమతో ఉంటున్నాయి. అలా తన కుటుంబంలో భాగమైన పెంపుడు శునకం కోసం ఓ మహిళ ఏకంగా ప్రత్యేక బెడ్రూం నిర్మించింది. ఆ బెడ్రూం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలిసింది. ఆమె ఎంతో శ్రద్ధగా స్వయంగా శునకం కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించింది. ఆ గదిలో కుక్క కోసం ఎటువంటి సౌకర్యాలుండాలో అన్ని ఏర్పాటు చేసింది. బెడ్రూం ఇంట్లో మెట్ల కింద నిర్మించింది. సంబంధిత వీడియోని రాడిట్‌లో "ఆమె మెట్ల కింద కుక్క కోసం బెడ్రూమ్‌ను నిర్మించింది" అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో స్వయంగా ఆమె కుక్క కోసం బెడ్రూమ్‌ను రూపొందించడాన్ని చూడొచ్చు. రూమ్‌లో ప్రత్యేకంగా ఓ పరుపు, తాగడానికి నీళ్లు, చక్కని లైటింగ్, గోడలు అందంగా కనిపించడానకి డెకరేషన్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.


ఈ వీడియోని పోస్ట్ చేసిన ఒక రోజులోనే 43 వేలకు పైగా అప్‌వోట్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. చాలా ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. కుక్క బెడ్రూం అద్దె ఎంత ఇవ్వాలంటూ ఒకరు కామెంట్ పెడితే, తన రూమ్ కంటె కుక్క గది అందంగా ఉందని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. కొంతమంది మాత్రం కుక్కలు ఎప్పుడు గదుల్లో ఉండాలనుకోవని, మనతోనే ఉండాలనుకుంటాయంటూ కామెంట్స్ పెట్టారు. ఇదిలావుంటే ఇటీవలె తమిళనాడులో ఓ వ్యక్తి తను పెంచుకున్న కుక్క కోసం గుడి కట్టించాడు. అంతేకాదు రూ.80 వేలతో పాలరాతితో కుక్క విగ్రహాన్ని కూడా తయారు చేయించి ప్రతిష్టించాడు. టామ్ అనే కుక్కతో ఉన్న ముత్తు పదకొండేళ్లు పాటు కలసి ఉన్నాడు. అయితే అనారోగ్యంతో అది చనిపోయింది. దాంతో ఆ బాధను తట్టుకోలేక కృంగిపోయాడు. దానికోసం మనమదురై సమీపంలోని బ్రాహ్మణకురిచ్చి దగ్గర ఉన్న తన వ్యవసాయ భూమిలో దేవాలయాన్ని నిర్మించి, ప్రతిరోజు నైవేద్యాలు కూడా పెడుతున్నాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన కుక్కను ఎక్కడ వదిలేయాల్సి వస్తుందోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు కుక్కలను తీవ్రంగా కొట్టి చంపుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వీధికుక్కలపై కొంతమంది విరుచుకుపడుతున్నారు. తమను ఇబ్బందిపెడుతున్నాయనే కారణంగా ఆ మూగజీవాలను కొట్టి మరీ చంపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa