ఇటీవల దేశంలో మతపరమైన అంశాలపై పెద్ద ఎత్తున్న వివాదాలు..చర్చలు సాగుతున్నాయి. అత్యాచారాల గురించి పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఓ ప్రొఫెసర్.. సమాజంలో పురాతన కాలం నుంచే దీని ఉనికి ఉందని పేర్కొంటూ హిందూ పురాణాలను ఉదాహరణగా చెప్పడం వివాదాస్పదమవుతోంది. ఈ ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివాదానికి కారణమైన ప్రొఫెసర్‌పై ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన చర్యలు మతవిశ్వాసాలను కించపరిచేవిగా ఉండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనిని ఏఎంయూ సైతం తీవ్రంగా పరిగణించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసి, సస్పెండ్ చేసింది. అలాగే, ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ప్రొఫెసర్ తన వ్యాఖ్యలపై ‘బేషరతుగా క్షమాపణ’ చెప్పారు. బోధన సందర్భంగా ఆయన ఉపయోగించిన స్లైడ్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) జేఎన్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ జితేందర్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. మంగళవారం ఆయన ఎంబీబీఎస్ మూడో ఏడాది విద్యార్థులకు అత్యాచారాలపై ఓ పాఠ్యాంశాన్ని బోధిస్తూ.. పవర్‌ప్రాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ‘అత్యాచారం పురాతన కాలం నుంచి ఉనికిలో ఉందని వివరించడానికి’ దేవుళ్లకు సంబంధించిన వివిధ పౌరాణిక ఉదాహరణలను ఇందులో వివరించారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా ప్రొఫెసర్ వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు, యూనివర్సిటీ యంత్రాంగం సైతం ప్రొఫెసర్ జితేందర్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులు, స్టాఫ్, పౌరుల మతపరమైన మనోభావాలను కించపరిచేలా వ్యవహరించినందుకు ఆయనకు 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసు జారీచేశామని తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఇద్దరు సభ్యులతో కమిటీని వేసినట్టు పేర్కొంది. డాక్టర్ జితేందర్ కుమార్ ఇచ్చిన వివరణ, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఎంయూ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa