ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్స్ఈ వేరియంట్ పై కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్దం

national |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 03:42 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, మహారాష్ట్రంలోని శివసేన ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా  ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే XE వేరియంట్ తొలికేసు ముంబయిలో నమోదయినట్టు చేసిన ప్రకటనతో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య విబేధాలు తలెత్తాయి. ఒమిక్రాన్ ఉప-వేరియంట్‌తో ఏర్పడిన ఈ కొత్తరకం ముంబయిలో గుర్తించామని మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌ రాగా.. ఆమెకు నిర్వహించిన జన్యు పరీక్షల్లో XE వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ప్రకటించగా.. కేంద్రం దానిని తోసిపుచ్చింది. ‘దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ రక్త నమూనాలను సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించగా జీఐఎస్ఏఐడీ XE వేరియంట్‌గా ధ్రువీకరించింది.. INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) నిర్ధారణ కోసం పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్ (NIBMG)లో మరో దఫా జన్యు విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది’ అని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నోట్ వెలువరించింది. ముంబయిలో నమోదయిన కేసు దాదాపు XE అని ఆ నోట్‌లో పేర్కొంది. ఒమిక్రాన్ ఉపవర్గాలు బీఏ.1, బీఏ.2లతో ఏర్పడిన ఈ హైబ్రిడ్ వేరియంట్ ‘XE’‌ను మొదటిసారిగా జనవరి 19న యూకేలో గుర్తించారు. ఇది ఒమిక్రాన్ కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. బీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్య అధికారి డాక్టర్ మంగాలా గోమరే మాట్లాడుతూ.. బుధవారం ఇన్సాకాగ్ సమావేశంలో తదుపరి విశ్లేషణ కోసం డేటాను ఎన్ఐబీఎంజీకి పంపాలని ఆదేశించారని తెలిపారు.


ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారిని టైమ్స్ ఆఫ్ ఇండియా సంప్రదించగా.. దీనిని ‘XE’ వేరియంట్ అని తొందరపడ్డామని చెప్పారు. ‘‘ప్రారంభంలో ఇది XE అని మేము కూడా భావించాం.. కానీ INSACOG నిపుణులు మరింత విశ్లేషించిన తర్వాత ఈ వేరియంట్ జన్యువులకు 'XE'‌తో పరస్పర సంబంధం లేదని లేదని గుర్తించాం’’ అన్నారు. ‘‘దక్షిణాఫ్రికాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 10న భారత్‌కు వచ్చింది.. ఆమెకు ఫిబ్రవరి 27న కోవిడ్ నిర్ధారణ అయ్యింది.. రక్త నమూనాలను జన్యు పరీక్షల కోసం కస్తూర్బా హాస్పిటల్‌ ల్యాబ్‌కు పంపాం.. ప్రాథమిక ఫలితాల్లో XE’ వేరియంట్ అని నిర్ధారణ అయ్యింది’’ అని మహారాష్ట్ర కోవిడ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ప్రదీప్ అవటే అన్నారు. బాధితురాలిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదని, పలుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 నెగెటివ్ వచ్చిందన్నారు. అయితే, XE అనుమానిత రోగికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని డాక్టర్ గోమరే చెప్పారు. ‘ఆమె రెండు డోస్‌ల టీకా వేసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినప్పుడు కోవిడ్ నెగెటివ్ రాగా.. మార్చిన 2న పాజిటివ్ అని తేలింది. ఆమె తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లోని క్యారంటైన్‌లో ఉన్నారు’ అని బీఎంసీ తెలిపింది. జన్యు విశ్లేషణకు పంపిన 376 నమూనాలలో 228 ముంబైకి చెందినవి అని బీఎంసీ నివేదిక పేర్కొంది. ముంబై రోగులలో 99% పైగా ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa