తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తజనం ఎగబడ్డారు. ఆది, సోమవారాల్లో టోకెన్లు కేటాయించడం లేదని, మంగళవారం విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుపతి భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల పంపిణీని మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ముందే చాలా మంది భక్తులు ఆయా కేంద్రాలకు పిల్లలతో సహా తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రం వద్ద భక్తుల తాకిడి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో తోపులాట జరిగింది. కొద్దిమంది పోలీసులున్నా, టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నా కట్టడి చేయలేకపోయారు. ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
అయితే, టీటీడీ అధికారులు, సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. లైన్ లో నిలబడిన వారికి సర్వదర్శనం టోకెన్లను కేటాయించకుండా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద జనం ఎగబడుతుండడంతో.. ఇవాళ్టికి ఎవరికీ టోకెన్లు అవసరం లేదని, టోకెన్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది.