ప్రాణహిత పుష్కర శోభను సంతరించుకుంది. బుధవారం నుండే పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 13 నుండి 24ల వరకూ పుష్కరాలు కొనసాగనున్నాయి.ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు.బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణను విడదీస్తూ పారుతున్న ప్రాణహితకు 13 నుంచి పుష్కర శోభ రానుంది. వార్ధా-పెన్‌గంగా నదుల కలయికతో కొమురంభీంజిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద పురుడుపోసుకున్న ప్రాణహిత 3 జిల్లాలు,3 రాష్ట్రాల సరిహద్దులను ముద్దాడుతూ 113 కిలోమీటర్లు గలగలపారుతూ త్రివేణి సంగమంలో అంతర్థానం అవుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, అటు మహారాష్ట్ర వైపు సిరోంచ, నగరం వద్ద పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కరాల నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని.. అసలు ప్రాణహిత పుష్కరాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 13 నుంచి 24 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు కొనసాగుతాయి. ఈ 12 రోజులు ప్రాణహిత నది తీరం, త్రివేణి సంగమం భక్తజన జాతరగా మారనుంది. మహారాష్ట్ర సిర్వంచ, తెలంగాణ అర్జునగుట్ట వద్ద రోజుకు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ అర్జునగుట్ట వద్దకు వెళ్లేందుకు బబ్బెరిచెలక నుంచి రహదారిని సిద్ధం చేశారు. వీఐపీల కోసం జైపూర్ ఎస్టీపీపీలో హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు అదికారులు. వేమనపల్లి, తుమ్మిడి హెట్టి ఘాట్లకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరాలు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసింది అక్కడి శివసేన సర్కార్. అక్కడి ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు రూ. 10 కోట్లు కేటాయించింది. మరోవైపు ప్రాణహిత పుష్కరాల నేపథ్యంలో పలు ప్రాంతాల నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది.