నిద్ర అంటే ఇష్టపడని వారుండరు. అలసిపోతే వెంటనే ముంచుకొచ్చేది నిద్రే. కొందరికి పని మధ్యలో కూడా నిద్ర వచ్చేస్తుంటుంది. అయితే తక్కువగా నిద్రపోయినా, ఎక్కువగా నిద్రపోయినా ఆరోగ్యానికి చేటు అంటూ కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోయే వారికి ఎదురయ్యే ముప్పుపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఓ పరిశోధక కథనం వెలువడింది. అందులో ఎక్కువగా నిద్రపోతే గుండె పోటు వచ్చే ప్రమాదముందని పేర్కొన్నారు. రోజూ మధ్యాహ్నం పూట 30 నిమిషాల పాటు కునుకుపాటు పడేవారితో పోల్చి చూస్తే, 90 నిమిషాలు అంతకు మించి ఎక్కువగా నిద్రపోయే వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రోజూ 30 నిమిషాల వరకు కునుకు తీసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు స్వల్పమని అన్నారు. అయితే మధ్యాహ్నం నిద్రపోని వారిలో గుండెపోటు రానేరాదని అధ్యయనం వెల్లడించింది.
అతిగా నిద్రపోయే వారిలో కొలొస్టరల్ స్థాయిలు ఎక్కువ అవుతాయని, ఛాతీ సైజు పెరగడం వంటి అనారోగ్య లక్షణాలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 62 ఏళ్ల వయస్సు ఉన్న చైనాకు చెందిన 31,750 మందిని అధ్యయనం చేసినట్లు జ్‌క్సియీవోమినంగ్ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఆరేళ్ల అధ్యయనంలో 1557 గుండె పోటు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాత్రి వేళ 7 గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్ర పోయే వారితో పోల్చితే 9 గంటలు కంటే అధికంగా నిద్రపోయేవారికి గుండెపోటు 25 శాతం ఎక్కువని గుర్తించామన్నారు.