నెల్లూరు కోర్టులో కీలక డాక్యుమెంట్ల చోరీ కేసు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ కేసులో ఏ1గా ఉన్నట్లు టీడీపీ నాయకుడు, కేసు పెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక కేసుకు సంబంధించి మాత్రమే డాక్యుమెంట్లు పోవడం, అందులోనూ మంత్రిగా కాకాణి బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే ఈ ఘటన జరగడంతో రాజకీయ రంగు పులుముకుంది.
ఈ చోరీ వెనుక మంత్రి కాకాణి హస్తం ఉన్నట్లు టీడీపీ నేతలు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి విమర్శించారు. కోర్టులో దొంగతనం జరగడం దేశంలో ఎక్కడా చూడలేదని, ఏపీలోనే ఈ తరహా వైఖరి కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఈ చోరీ కేసులో పోలీసులు శుక్రవారం నాటికి పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ పోలీసు, కోర్టు ఉద్యోగి ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తతంగంలో ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.