ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా సైనిక చర్య ప్రారంభించి 50 రోజులు పూర్తయింది. బలమైన సైనిక సంపత్తి ఉన్న రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటికీ ఇంకా లుహాన్స్క్, ఖార్కివ్, మరియుపోల్ సహా పలు నగరాలపై రష్యా దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ ఏకంగా రష్యా భూభాగంపైనే దాడులతో విరుచుకుపడుతోంది.
5 రోజుల్లో ఉక్రెయిన్ లొంగిపోతుందని రష్యా భావించిందని, 50 రోజులైనా ఆ పరిస్థితి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉద్వేగంగా శుక్రవారం ప్రసంగించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 20 వేల రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. 163 యుద్ధవిమానాలతోపాటు 144 హెలికాప్టర్లు, 756 ట్యాంకులు, 1443 సాయుధ శకటాలు, 76 ఇంధన ట్యాంకులు, ఎనిమిది నౌకలు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.